ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న ఇమేజ్ కోసమో.. అప్పుడప్పుడు అవసరమో అని అనుకుంటారేమో కానీ ఏపీ ప్రభుత్వంపై దారుణమైన నిందలేసేందుకు ఆంధ్రజ్యోతి ఒక్కోసారి లైన్ క్రాస్ అయిపోతూ ఉంటుంది. ఇటీవల కొన్ని అంశాల్లో నిజమైన కథనాలు రాశారు. రౌడీషీటర్ కు పెరోల్ అంశంతో.. టీడీపీ కార్యకర్తల్లోనూ ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసినా.. నిజమే రాస్తుందన్న ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని ఒక్క సారిగా ఓ పెద్ద స్కాం అంటూ ఆరోపణలు చేశారు.
మాస్క్ తయారీ కంపెనీకి సూర్యఘర్ కాంట్రాక్ట్ ఇచ్చారని.. రూ. ఎనిమిది వేల కోట్లు ఆ కంపెనీకి కట్టబెట్టారని రాసుకొచ్చారు. ఆ కంపెనీ ప్రతినిధి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ పనులు చక్కబెడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఆ కథనం చదివిన వారికి .. కాస్త అవగాహన ఉన్న వారికి ఎక్కడో లింక్ కుదరడంలేదనే డౌట్ రావడం సహజం. దాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ కవర్ చేసింది. అసలు ఆ పథకంలో టెండర్ అనే పద్దతే లేదని.. ఏ వెండర్ కూ ప్రాథాన్యత లేదని స్పష్టం చేసింది. టెండరే లేనప్పుడు ఓ కంపెనీకి కేటాయించారన్న ప్రశ్నే రాదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల కోసం పిలిచిన టెండర్లలో ఆంధ్రజ్యోతి చెప్పిన కంపెనీ పాల్గొనలేదు.
ఆంధ్రజ్యోతి దాన్ని కవర్ చేసుకునేందుకు మాస్కుల తయారీ కంపెనీ ఓనర్ ప్రభుత్వ బోర్డు పెట్టుకున్న కారులో తిరుగుతున్నారని..తాము కథనం ప్రచురించిన తర్వాత దానికి మాస్క్ వేశారని చెప్పుకుంటోంది.కానీ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి.. టెండర్లు లాంటివి లేవని.. మరింత వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఆ పత్రికపై లేదా?
