కొత్తపలుకు : జగన్ ఫిరాయింపుల నీతుల వెనుక అసలు కథ అదేనట..!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. రాజకీయ విశ్లేషణల్లో.. అప్పుడప్పుడు అతి కనిపించినా… లాజిక్ మాత్రం మిస్ కాదు. అలా జరగడానికి అవకాశం ఉందని ఎవరైనా అనుకోక తప్పదు. అయితే.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించిన తర్వాత.. ఆయన కాస్త సంయమనం పాటిస్తున్నారు. కానీ చెప్పాలనుకున్నది మాత్రం చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం.. జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపులపై.. అన్ని నీతి వాక్యాలు ఎందుకు చెబుతున్నారన్నదానిపై.. ఆసక్తికర విశ్లేషణ చేశారు.

టీడీపీ నేతలపై “ఆకర్ష్ ” వద్దనుకోవడానికి అసలు కారణం బీజేపీ..!

జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఆయనకు 90 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండి ఉంటే… ఫిరాయింపులపై.. అసెంబ్లీలో ఇప్పుడు చెప్పినన్నీ నీతి వాక్యాలు చెప్పి ఉండేవారా..? . అనే డౌట్ అందరితో పాటు రాధాకృష్ణకూ వచ్చింది. అలాంటి అవకాశమే రాజకీయాల్లో ఉండదని.. ఆర్కే.. గట్టి నమ్మకం. గతంలో మా ఎమ్మెల్యేల్ని లాక్కున్నారు.. ఇప్పుడు.. మేం లాక్కుంటున్నాం.. చెల్లుకు చెల్లు.. అని .. తన పని తాను చేసుకుపోయేవారు జగన్. అందులో సందేహం ఉందు. దీనికి చక్కని ఉదారణలో.. ఆపత్కాల మిత్రుడు.. కేసీఆర్.. తెలంగాణలో చేస్తున్న ఫిరాయిపుల్ని… సాక్షి పత్రిక ప్రశంసించడం. అయితే.. ఫిరాయింపుల్ని ఇప్పుడు ప్రొత్సహించకపోవడానికి అది మాత్రమే కారణం కాదంటున్నారు ఆర్కే. టీడీపీ నేతల్ని తమకు వదిలేయమని.. బీజేపీ పెద్దలు.. చెప్పినట్లుగా.. దానికి.. వైసీపీ అధినేత అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే టీడీపీ నేతలకు వైసీపీ నుంచి ఎలాంటి ఆఫర్లూ రావడం లేదు. త్వరలో వారికి బీజేపీ నుంచే వచ్చే అవకాశం ఉందనేది ఆర్కే పాయింట్.

నిధుల విషయంలో మోడీపై నమ్మకమా..?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి “ఓవర్ డ్రాఫ్ట్” పై ఉంది. ప్రతి నెలా జీతాల కోసం.. ముందస్తుగా ఆదాయంపై అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి… చేతికి ఎముక లేదన్నట్లుగా… హామీలు ప్రకటిస్తున్నారు. జీతాలు పెంచుతున్నారు.. అంతకు మించి.. సంక్షేమ పథకాల తేదీలు ప్రకటిస్తున్నారు. కేబినెట్‌ భేటీలో… చాలా మంది మంత్రులు.. అధికారులు నిధుల లభ్యత గురించి… చూసుకుందామని.. అడిగినా…. అవన్నీ తాను చూసుకుంటానని.. జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా.. ఆర్కే చెబుతున్నారు. సంక్షేమ పథకాలకు.. నిధులు కావాలంటే.. రూ. యాభై వేల కోట్లు అవసరమని.. అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెస్తారన్న అనుమానం ఆర్కే వ్యక్తం చేశారు. బహుశా.. ప్రధాని గట్టి హామీ ఇచ్చి ఉంటారనే సందేహం ఆర్కేకు వచ్చింది. అలా ఇవ్వడానికి మోడీకి మనసు ఎలా వస్తుందన్న సందేహం కూడా.. మళ్లీ ఆయనకే వచ్చింది.

జగన్‌కు వల్ల కేసీఆర్‌కు ఇబ్బందే..!

జగన్మోహన్ రెడ్డి.. హామీలు నెరవేర్చాలనే పట్టుదలతో చేస్తున్నారో… ఇతర కారణాలేమైనా ఉన్నాయేమో కానీ… వరుసగా.. వరాలు ప్రకటిస్తూ పోతున్నారు. ఇది సహజంగానే కేసీఆర్ కు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ ఆర్థిక శాఖ లేదని… 20 శాతం వరకూ అయితే ఎలాగోలా నెట్టుకురావొచ్చని.. కేసీఆర్‌కు.. అధికారులు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు జగన్ 27 శాతం ప్రకటించడంతో.. కేసీఆర్‌కు 27 శాతం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు ఆర్కే. అలాగే సీపీఎస్, ఆర్టీసీ విలీనం వీటన్నింటిపై జగన్ తీసుకున్న నిర్ణయాలు… తెలంగాణ సర్కార్ పై ఒత్తిడి పెరగడానికి కారణమం కాబోతున్నాయంటున్నారు ఆర్కే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com