మీడియాపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ ను, ఆ పార్టీ నేతల్ని ఆంధ్రజ్యోతి ఎండీ వేమారి రాధాకృష్ణ తన కొత్తపలుకు ఆర్టికల్‌లో చెడుగుడు ఆడుకున్నారు. మాకు కష్టం వస్తే తెలంగాణకు కష్టం వచ్చిటన్లుగా అన్నట్లుగా అతి చేసే అహంకారం తగ్గించుకోకపోతే అడ్రస్ లేకుండా పోతారని నేరుగానే హెచ్చరించారు. కేసీఆర్ పుట్టుపూర్వోత్తరాల గురించి మొత్తం తెలిసిన తనకు ఆయన గొప్పతనం గురించి చెప్పాలనుకోవడం జగదీష్ రెడ్డి లాంటి మరుగుజ్జుల పిచ్చితనమని తేల్చారు. ఈ వారం ఆర్టికల్ మొత్తం.. బీఆర్ఎస్ పార్టీ అహంకారం ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికే ఆర్కే ప్రాధాన్యం ఇచ్చారు. మీడియాపై దాడి, హెచ్చరికలు, ఆంధ్రా మీడియా అంటూ ముద్ర వేయడంపై వారి నైజాన్ని బయట పెట్టారు.
ఆర్కే తన ఆర్టికల్ లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందని గుర్తు చేశారు. ఒక్క ఎంపీని గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ అహంకారాన్ని భరించలేకనే ప్రజలు బండకేసి కొట్టారని గట్టిగా గుర్తు చేశారు. హైదరాబాద్‌పై తమకే హక్కు ఉందన్నట్లుగా ఇక్కడి వారికి జగదీష్ రెడ్డి వండి పెడుతున్నట్లుగా చేస్తున్న ప్రకటనల్ని కామెడీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుల్ని.. అహంకారంతో అదే తప్పుల్ని రిపీట్ చేస్తున్న వైనం, కేటీఆర్ భాష ఏవీ.. ప్రజల మద్దతు పొందలేకపోతున్నాయని కూడా గుర్తు చేశారు.
దాడులు చేసి మీడియాను దారికి తెచ్చుకుందామనుకుంటే..ఓ సారి చరిత్రను తిరగేసుకోవాలని కూడా సూచించారు. తమ సంస్థలపై వైఎస్ హయాం నుంచి ఎన్నో దాడులు జరిగాయని …ఏం చేయగలిగారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో.. ప్రజలను పట్టించుకోకుండా.. అహంకార పూరితంగా వ్యవహరిస్తే.., ఆ పార్టీకి ఇక మనుగడ కష్టమనే.. అదే సూత్రం మీడియాకు వర్తిస్తుందని ఆర్కే స్పష్టం చేశారు. ప్రజాకోణంలో ఉండబట్టే ఆంధ్రజ్యోతి ఇంత కాలం నిలబడిందని.. అదే బీఆర్ఎస్ పతనం అయిందని గుర్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. అరే కరే అనుకునేంత మిత్రులు. కేసీఆర్ ఉద్యమంతో ఎదిగిన తర్వాత ఆ మిత్రుత్వం పోయి ఉండవచ్చు కానీ.. వ్యక్తిగత శత్రుత్వాన్ని ఆర్కే పెంచుకోలేదు. కానీ కేసీఆర్ పెంచుకున్నారు. అదే విషయాన్ని ఆర్కే పరోక్షంగా చెప్పినా… అహంకారం వదులుకోవాలని.. జరిగిన తప్పులేమిటో తెలుసుకుని దిద్దుకోవాలని పద్దతిగానే సలహాలు ఇచ్చారు. కేసీఆర్ ఆత్మీయుడి సలహాలు బీఆర్ఎస్ నేతల బుర్రలకు ఎక్కుతాయో లేదో మరి !