రేవంత్ రెడ్డి రోజు రోజుకు బలోపేతం అవుతూంటే .. కేసీఆర్ మరింత బలహీనం అయిపోతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కొత్త పలుకులో విశ్లేషించారు. తెలంగాణలో మాట్లాడుతున్న రాజకీయ ముతకభాషపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. చంద్రబాబును కేసీఆర్ టార్గెట్ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వారం కొత్తపలుకును సూటిగా రాసుకొచ్చారు.
ఆర్కే కొత్త పలుకు సారాంశం చాలా క్లియర్ గా ఉంది. కేసీఆర్ లో అహంకారం ఇసుమంతైనా తగ్గలేదు. అలాగే ఆయనకు మళ్లీ సర్వైవ్ కావడానికి చంద్రబాబు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని.. రాను రాను ప్రజలు మర్చిపోతున్నారని క్లారిటీ రావడంతో పాటు .. ప్రస్తుత నాయకత్వం భరోసా ఇవ్వడం లేదని గుర్తించి.. తాను మళ్లీ రంగంలోకి వస్తానని క్యాడర్ కు భరోసా కల్పించడానికే ఆయన తంటాలు పడుతున్నారని ఆర్కే చెబుతున్నారు. కానీ కేసీఆర్ ప్రయత్నాలు.. ఆయనపై జాలి కలిగేలా చేస్తున్నాయని కూడా అంటున్నారు.
రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో బలపడుతున్నారని ఆర్కే తేల్చేశారు. అటు పాలనా పరంగా..ఇటు పార్టీలోనూ ఆయన పరిస్థితి మెరుగుపడిందని.. మరోసారి తానే సీఎం అవుతానని కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీల్లో ప్రకటించుకోవడం అసాధ్యమని కానీ రేవంత్ ప్రకటించుకుంటున్నారని.. పార్టీపై రేవంత్ పట్టు పెరిగిందని చెప్పడానికి ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలని ఆర్కే చెబుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ ఆరిగిపోయిన ఆయుధంతో యుద్ధానికి వస్తూ ఔట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారని తేల్చేశారు. అందుకే కేసీఆర్ రాను రాను బలహీనపడుతున్నారు కానీ బలోపేతం కావడం లేదని తేల్చేశారు.
చంద్రబాబు ఎప్పుడూ కేసీఆర్ ను కానీ..కేటీఆర్ ను కానీ పల్లెత్తు మాట అనలేదు. రాజకీయంగా కూడా విమర్శించడం మానేశారు. అయినా కేసీఆర్ పని గట్టుకుని స్పేస్ లేకపోయినా తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబును తెచ్చి అవమానించేలా మాట్లాడటం ఆయనకు కీడే చేస్తుంది కానీ మంచి కాదన్నది ఆర్కే వాదన. రేవంత్ రెడ్డి కంటే తాను గొప్ప అని కేసీఆర్ భావన అని.. ఆయన వాస్తవ ప్రపంచంలోకి రాకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని తేల్చారు. కేసీఆర్, కేటీఆర్ మారకపోతే.. ఆ పార్టీ భవిష్యత్ కష్టమే అని అంతిమంగా ఆర్కే తన కథనంలో తేల్చారు.

