నైని కోల్ బ్లాక్ టెండర్లను భట్టి విక్రమార్కతో పాటు ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి కలసి కొట్టేద్దామని ప్లాన్ చేశారని తానే బయటపెట్టానని ఆర్కే ప్రకటించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు తాను బయట పెట్టానని చెప్పుకోవడం క్రెడిట్ చోరీనేనని అన్నారు. సింగరేణికి మేలు జరిగితే ఎవరు క్రెడిట్ చోరీ చేసినా పర్వాలేదని ముక్తాయింపునిస్తూ ఈ వారం కొత్త పలుకులో తన జర్నలిజానికి ఉన్న క్రెడిబులిటీని, దాన్ని ఎలా సాధించుకున్నారో చెప్పుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. పనిలోపనిగా ఈ గూడుపుఠాణిలో తనకు అంతా తెలుసని భట్టి విక్రమార్కకు ఓ మీటింగ్ గురించి టీజర్ ఇచ్చారు.
మహిళా అధికారులపై వ్యక్తిత్వ హననం కథనాలు రాసినప్పుడు .. ఇలా ఎందుకు జరుగుతుందని తాను ఆరా తీశానని అప్పుడే తనకు అసలు విషయం తెలిసిందన్నారు.. అప్పటివరకూ తనకూ తెలియదని ఆర్కే చెప్పుకొచ్చారు. అప్పుడు ఆరా తీసినప్పుడు చాలావిషయాలు తెలిశాయన్నారు. సైట్ విజిట్ రూల్ పెట్టాలని సింగరేణి అధికారులను పిలిచి భట్టి విక్రమార్క, ఎన్టీవీ చౌదరి సమావేశాలు పెట్టారు. ఆ తర్వాతే నిబంధనలు మారాయని ఆర్కే చెబుతున్నారు. ఆ సమావేశానికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆర్కే చెబుతున్నారు.
ఇది మాత్రమే కాదు.. ఈ కథనం మొత్తం తన క్రెడిట్ గురించే ఎక్కువగా చెప్పుకున్నారు. తాను కోల్ బ్లాక్ టెండర్ల గురించి బయట పెట్టడం వల్లనే దాన్ని పక్కదారి పట్టించడానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో హడావుడి ప్రారంభమయిందని కూడా చెబుతున్నారు. నిజానికి ఫార్ములా ఈ రేసు కేసు, కాళేశ్వరం కేసుతో పాటు ఈ ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవడానికి అవసరమైన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయని కానీ ప్రభుత్వమే ఆలస్యం చేస్తోందని ఆర్కే చెబుతున్నారు. ఎంత ఆలస్యమైతే కేసు అంతగా బలహీనం అవుతుందని.. వెంటనే కేసీఆర్, సంతోష్ రావులకూ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆర్కే ఈ కథనంలో పరోక్షంగా సలహా కూడా ఇచ్చారు.
విచిత్రం ఏమిటంటే… ఆ దర్యాప్తు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేటీఆర్, కేసీఆర్ మాటల్ని కూడా విని ఉంటారని రాసుకొచ్చారు. మనిషి కుతూహలం అలాంటిదని సమర్థించుకున్నారు. అంటేవారి కూడా బాధితులే అయి ఉండవచ్చని ఆర్కే చెబుతున్నారన్నమాట. ఈ కథనంలో ఆర్కే తన జర్నలిజం చాలా గట్టిదని విలువల మీద నిలబడిందని చెప్పుకోవడానికి మరోసారి గట్టిగానే ప్రయత్నించారు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ లభించింది కూడా. మొదట బీఆర్ఎస్ నేతలు ఈ కథనంలో నిజానిజాలు తేల్చాలని సిట్ వేయాలని కూడా డిమాండ్ చేశారు. తర్వాత మేమే చెప్పామంటున్నారు. కారణం ఏదైనా ..బీఆర్ఎస్కు మాత్రం ఆర్కే ఇంకా టార్గెట్ గానే ఉన్నారు. అది కూడా చెప్పుకున్నారు.

