నెయ్యిని కల్తీ చేసిన జగన్, వైసీపీ నేతలు ఇప్పుడు ఆ తప్పు ను కప్పిపుచ్చుకోవడానికి మతాన్నీ కూడా కల్తీ చేస్తున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్తపలుకులో తేల్చేశారు. దానికి ఆయన బలమైన సాక్ష్యాలను కూడా ఇచ్చారు. క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వైసీపీ నేతలు తాము ఏ మాత్రం సిగ్గుపడకుండా హిందువులం అని చెప్పుకోవడమే కాకుండా.. కొత్తగా గుళ్లూ, గోపురాలు తిరిగి .. కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నామాలెక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఉదాహరణలు చెప్పారు.
జగన్ రెడ్డి ఇటీవల ఓ లఆలయం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. నామాలు పెట్టుకుని ఏదో నమ్మించడానికి ప్రయత్నించారు. ఇక జగమెరిగిన క్రైస్తవ నాయకులు అయిన వైసీపీ నేతలు కూడా.. ఇదే పని చేస్తున్నారు. ముఖ్యంగా కల్తీ నెయ్యిఅంశం బయటపడిన తర్వాత హిందువులంతా తమను దూరం చేస్తారన్న భయంతో ఇప్పుడు ..తమకు నమ్మకం లేని దేవుడిపై ఎక్కువ భక్తి నటిస్తూ. హడావుడి చేస్తున్నారు. వీరు చేస్తున్న ప్రయత్నాలనే ఆర్కే.. మతాన్ని కల్తీ చేయడం అని పోల్చారు. ఆయన చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది. తాము ఆచరించే మతాన్ని బహిరంగంగా చెప్పుకోలేని వైసీపీ నేతలు.. ఆచరించని, నమ్మని మతాన్ని మాత్రం బహిరంగంగా ప్రదర్శించేందుకు రెడీ అయిపోతున్నారు.
ఈ విషయాన్ని తన కొత్త పలుకు ద్వారా ఆర్కే బాగానే ఎక్స్ పోజ్ చేశారు. అయితే బీఆర్ నాయుడు విషయానికి వచ్చే సరికి ఆయన .. ఎవరో సోషల్ మీడియాలో పని లేని వ్యక్తి.. అవి ఫేక్ వీడియోలని కేసులు పెట్టిన తర్వాత.. డైవర్ట్ చేయడానికి వాటిని ఆంధ్రజ్యోతి ఆర్కే బయటపెట్టాడన్న పోస్టు పెడితే.. దానికే చాలా వివరణ ఇచ్చారు. తనకు పదవులపై వ్యామోహం లేదని.. తాను ఇండిపెండెంట్నని.. తాను ఎందుకు బీఆర్ నాయుడుపై కుట్ర చేస్తానని వివరణ ఇచ్చారు. ముక్కూ ముఖం తెలియని వ్యక్తి ఓ పోస్టు పెడితే ఇంత వివరణ ఇవ్వడం అవసరం లేదు. అయితే ఆర్కే తన కథనంలో ఈ వీడియోలు ఫేక్ అని టీటీడీ చైర్మన్ కేసులు పెట్టారని.. చెప్పలేదు. కానీ వారి మధ్య జరిగింది వ్యక్తిగతం అని స్టాంప్ వేసేందుకు ప్రయత్నించారు. వారి మధ్య వ్యక్తిగతంగా ఏదో ఉందన్న ధృవీకరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
చివరికి అమెరికాపైనా ఆర్కేకు కోపం వచ్చింది. రష్యా ఆయిల్ కొనడానికి అమెరికా పర్మిషన్ ఇచ్చినట్లుగా ప్రకటన చేయడం కించపర్చడమేనని ఇది.. అమెరికాకు మంచిది కాదన్నారు. చలిచీమల సామెత కూడా చెప్పారు. మరి మన దేశ పాలకులు ఎందుకు లొంగిపోయారని విమర్శించడానికి ఆర్కేకు చాయిస్ ఉంది. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు.


