కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు. దాని వల్ల కష్టమో ..నష్టమో భరించేది కేసీఆర్.. ఆయన పార్టీ నేతలు. కానీ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఈ వారం ఆర్టికల్ మొత్తం కేసీఆర్ బీఆర్ఎస్ పైనే చర్చించారు. అయితే ఆ ఆర్టికల్‌లో ఓ ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయికి వెళ్లడం ఏమిటి.. అన్న బాధే కనిపించింది కానీ.. కేసీఆర్ గత సామర్థ్యాన్ని అంచనా వేసి.. కేసీఆర్ చేయగలడు.. ప్రయత్నించండి అనే ప్రోత్సాహంగా ఒక్క మాట చెప్పలేకపోయారు.
ఆర్కేకు కేసీఆర్ మధ్య వ్యక్తిగతంగా స్నేహం ఉంది. రాజకీయంలో కేసీఆర్ రాజీ పడరు.. తన పత్రిక విషయంలో ఆర్కే కూడా అంతే. ఇద్దరూ ఎవరు ఏదనుకుంటే అదే చేస్తారు. అందుకే ఆర్కేకు ఉపయోగం అని కేసీఆర్ ఇంత వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు…అలాగే ఆర్కే కూడా టీఆర్ఎస్కు అనుకూలం అని ఆయన తీసుకున్న నిర్ణయాలను సమర్థించలేదు. అయితే ఈ సారి కొత్తపలుకులో మాత్రం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం ఎందుకు ఉన్న సీటు పోగొట్టుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదన్న ఓ నిరాశావాదాన్ని పెంచడానికే ఆర్కే ఉపయోగించుకున్నారు.
ఆర్టికల్‌లో ఆర్కే చెప్పినవన్నీ కేసీఆర్‌కు తెలియనివా ?. తెలంగాణ ను వదిలిస్తే ఆయన ఆయుధం వదిలేసినట్లు అవదా ? అవన్నీ తెలియకుండానే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా ?. ఆర్కేకు చెప్పనంత మాత్రాన ఆయన పార్టీ విధి విధానాలు.. ఆశయాల గురించి ఎవరికీ చెప్పలేదనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆయన తనది రైతు ఎజెండా అని .. జాతీయ పార్టీ వాక్యూమ్ ఉందని.. దాన్ని తాను భర్తీ చేస్తానని చెబుతున్నారు. ఆర్థిక సామర్థ్యం కూడా ఉందని లెక్కలేసుకుని రంగంలోకి దిగారు.
రాజకీయాలన్న తర్వాత డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకునేవారికే అవకాశాలొస్తాయి. కేసీఆర్ ఇప్పటికి సాధించాల్సింది సాధించారు. మరోసారి ఆయన తెలంగాలో అధికారం చేపట్టడం కన్నా.. తన పరిధిని విస్తరించుకోవడాన్ని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. మిత్రుడైన ఆర్కే.. కేసీఆర్‌కు కనీసం ప్రోత్సాహకరంగా ఒక్క మాట చెప్పలేకపోయారు కానీ.. చాలా మాటలు చెప్పి.. నిరాశ పరిచారు.