ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాడుతోంది తానేనన్నట్లుగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్‌లో చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొడుతున్నారో.. తనకు ఇప్పుడు అవకాశం వచ్చిందని… చెలరేగిపోతున్నారో కానీ.. రెండు వారాల కిందట.. కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని సవాల్ విసిరిన ఆయన ఈ వారం… ప్రభుత్వంపై…తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై తానే ఎదురు కేసులు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు…తన టీవీ చానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై రాజద్రోహం కేసులు పెట్టిన సీఐడీ ఏడీజీ సునీల్‌తో పాటు… కేసులు పెట్టించిన సూత్రధారుల్ని జైలుకు పంపించే వరకూ.. నిద్రపోనన్నట్లుగా ఆయన సవాల్ చేస్తున్నారు.
ఈ వారం కొత్తపలుకులో ఏపీ రాజకీయాలే డామినేట్ చేశాయి. ప్రధానంగా రాజద్రోహం కేసు పరిణామాలను ఆర్కే విశ్లేషించారు. సుప్రీంకోర్టు రెండు ధర్మాసనాలు రాజద్రోహం కేసులపై సూటిగా… స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం.. అందులో జర్నలిస్టులకు రాజద్రోహం కేసుల నుంచి రక్షణ ఉంటుందని స్పష్టంగా చెప్పడంతో.. వేమూరి రాధాకృష్ణకు కొండంత బలం వచ్చిటనట్లయింది. ఆ కేసుల్ని ఎలాగూ కొట్టేస్తారని.. అంత మాత్రాన తాము సంతోషపడేది లేదని… ఆ తప్పుడు కేసులు పెట్టిన వారిని కోర్టుకు లాగి.. శిక్ష పడేలా చేస్తామంటున్నారు. ఈ క్రమంలో.. ఆయన జగన్‌నే టార్గెట్ చేశారు. సీఐడీ ఏడీజీ సునీల్ ఒక్కరే ఆపనిచేసి ఉండరని.. ఖచ్చితంగా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని..రాజధద్రోహం కేసుల వెనుక జగన్ ఉన్నారని తేల్చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా న్యాయప్రక్రియ ద్వారా తేల్చుకుంటానంటున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రాజ్యాంగ వ్యతిరేక పాలన అని పదే పదేచెప్పే సమయంలో.. వేమూరి రాధాకృష్ణ.. కేసీఆర్ తీరును కూడా తప్పు పట్టారు. ఇద్దరూ నియంతల్లా మారారని తేల్చేశారు. బహుశా ఆయన ఈటల ఎపిసోడ్ గురంచి చెప్పి ఉండవచ్చు. నిజానికి.. ఈటల ఎపిసోడ్ గురించి.. తెర వెనుక జరిగిన పరిణామాల గురించి ఆర్కే రాయవచ్చు. ఎందుకో కానీ ఈ సారికి ఆయన… ఏపీ పరిణామాలపైనేపూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. బహుశా.. ఏపీ సర్కార్‌తో ముఖాముఖి తలపడుతున్నది తానేనన్న ఇమేజ్ కోసం.. ఆర్కే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే… కేసులుపెట్టుకో.. అరెస్ట్ చేసుకో అనే సవాళ్ల దగ్గర్నుంచి ఎదురు కేసులు పెట్టబోతున్నానన్న హెచ్చరికల వరకూ వచ్చారు.
ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయడానికి సీఎం జగన్ చేయని ప్రయత్నాలు లేవు. చివరికి రూ. వంద కోట్ల పరువు నష్టం వేస్తానని… ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చారు కానీ.. ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత వేమూరి రాధాకృష్ణ… సుబ్రహ్మణ్య స్వామి అసలు లాయరే కాదు.. ఎలా వాదిస్తారని ధర్మసందేహం వెలిబుచ్చారు. అంతే కాదు..తనపై తప్పుడు ఆరోపణలు చేసిన.. సుబ్రహ్మణ్య స్వామిపైనే ఎదురు కేసు వేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ వేయలేదు. అటు సుబ్రహ్మణ్యస్వామి కూడా.. వేయలేదు. దీంతో.. ఇద్దరూ వెనక్కి తగ్గారేమో అనుకుంటున్నారు. ప్రస్తుతం.. తాను రివర్స్‌లో న్యాయపోరాటం చేస్తానని హెచ్చరికలు చేయడం ద్వారా.. జగన్‌ను.. తనపై… తన సంస్థలపై కేసులు పెట్టకుండా నిలువరించే ప్రయత్నాన్ని ఆర్కే చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.