ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓ వైపు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ రంగంలోకి దిగుతున్నారు. వీరిద్దరూ చెరో ప్రాజెక్టును పట్టుకున్నారు. ఏబీవీది బనకచర్ల టార్గెట్ అయితే.. నిమ్మగడ్డ రమేష్ ది. అమరావతిది రెండో విడత భూసమీకరణ అంశం.
బనకచర్ల ఏపీకి భారం అని మొదట ఏబీ వెంకటేశ్వరరావు వాదించడం ప్రారంభించారు. ఆలోచనాపరుల వేదిక అని పెట్టి.. ఇప్పుడు తన వాదనకు రూపం ఇచ్చేందుకు పర్యటనలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీశైలం ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టుల స్థితిగతులను అధ్యయనం చేస్తానని ఆయన ప్రకటించారు. మరో ఇద్దరు నిపుణుల్ని తన టీములో కలుపుకుని తన పని తాను చేసుకుపోతున్నారు.
కొత్తగా రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. రాజధాని రెండో విడత భూసమీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన ఎన్నికలకు ముందు ఓ వేదికను పెట్టుకున్నారు. ఆ వేదిక మీదుగానే ఇప్పుడు.. అమరావతి రెండో విడత భూసమీకరణకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అయితే నేరుగా కాకుండా.. ముందు మొదటి దశ విజయవంతం చేసి.. భూములిచ్చిన రైతులకు మేలు చేయాలని ఆ తర్వాతే రెండో దశ గురించి ఆలోచించాలని అంటున్నారు.
వీరిద్దరూ ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు ప్రాజెక్టుల విషయంలో ప్రజల్లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ జగన్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన వారే.