మాజీ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు ఆరు నెలల్లో పార్టీ పెడతానని ప్రకటించారు. ఓ ఆన్ లైన్ పేపర్ కు ఇంటర్యూ ఇచ్చి దాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేసుకున్నారు. అందులో ఉన్న వివరాల ప్రకారం టీడీపీలో చేరాలని అనుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. అందుకే ఆయనపై ఒత్తిడి కోసం తిరుగుబాటు తరహా వ్యవహారాలు ప్రారంభించారు. ఇప్పుడు అది చంద్రబాబు అసలు పట్టించుకోని స్థితికి వెళ్లింది. దాంతో ఇకఆరు నెలల్లో పార్టీ పెడతానని ఆయన ప్రకటించుకుంటున్నారు.
ఓ పదవి ఇచ్చిన చంద్రబాబు
ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ, అధినేత చంద్రబాబు నాయుడు నుంచి సానుకూల స్పందన రాలేదని ఆయనే చెప్పుకుంటున్నారు. కీలకమైన పదవి లేదా రాజకీయ ప్రాధాన్యతను ఆయన ఆశించినా, ప్రభుత్వం లేదా పార్టీ పరంగా ఆయనను దూరం పెట్టడమే ఇప్పుడు ఆయనలో అసంతృప్తికి కారణం . తనను చంద్రబాబు పట్టించుకోకపోవడంతోనే, ఆయన ఇప్పుడు స్వయంగా సొంత పార్టీ పెడతానంటూ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు ఆయనను పార్టీలో అధికారికంగా చేర్చుకోకపోయినా పదవి ఇచ్చారు. కానీ ఆ పదవిని ఏబీవీ తన రేంజ్ కు తగ్గది కాదన్నట్లుగా చూసి తీసుకోలేదు. రాజకీయాల్లో డీజీపీలుగా చేసిన వారు కార్పొరేటర్లుగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రాజకీయాన్ని ఏబీవీ అర్థం చేసుకోలేదు.
వ్యవస్థల్లోనే పని చేశారు కదా.. అవినీతిపై చర్యలు ఇన్‌స్టంట్‌గా తీసుకోలేరని తెలియదా?
ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు మేఘా ఇంజనీరింగ్, షిరిడిసాయి వంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన ఘోరాలకు ఉన్న పళంగా శిక్షలు వేయాలని ఆయన అనుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన ఈ సంస్థలపై విచారణ జరపాలని ఆయన కోరుతున్నారు. అయితే, ఈ డిమాండ్ల వెనుక వ్యవస్థల ప్రక్షాళన కంటే, ప్రభుత్వానికి తన గళం వినిపించాలనే రాజకీయ ఆకాంక్షే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. తాను ఆశించిన రాజకీయ గుర్తింపు లభించనందుకే, ఇండైరెక్ట్‌గా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన స్వయంగా ఐపీఎల్.. చట్టబద్ధమైన పాలనలో నిర్ణయాలు ఎలా తీసుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఎంత ఆలస్యమవుతుందో కూడా ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన ఉద్దేశపూర్వకంగానే అవే ఆరోపణలు చేస్తున్నారు.
పట్టించుకోని టీడీపీ, చంద్రబాబు
ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడంలేదని లేదు. టీడీపీ కూడా లైట్ తీసుకుంది. టీడీపీ క్యాడర్ ఆయనను జగన్ వేధించినప్పుడు చాలా సపోర్టు చేసింది. కానీ ఇప్పుడు ఆయనను పట్టించుకోవడంలేదు. ఓ మాజీ ఉన్నతాధికారి పార్టీ పెట్టి ఏ మేరకు రాణించగలరనేది సందేహమే అయినప్పటికీ, ఆయన చేసే విమర్శలు , డిమాండ్లు ప్రభుత్వానికి సమస్యలుగానే ఉంటాయి. రాజకీయ ఆశలు నెరవేరకపోవడంతోనే ఆయన తన పంథాను మార్చుకున్నారని సులువుగానే అర్థమవుతోంది.
