ఒక్క డీల్‌కు లంచం ఐదు కోట్ల రూపాయలు. అది కూడా మొహమాటం లేదు. నేరుగా ఆఫీసుకు వచ్చి క్యాష్ ఇస్తేనే పని అవుతుంది. అంత బరి తెగింపు ఎవరికి ఉంటుంది?. గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ కు ఉంటుంది. పనులు పూర్తయ్యాయో లేదో చూసి బిల్లుల మంజూరుకూ సంతకాలు పెట్టాల్సిన. ఆ అధికారి..బేరం పెట్టారు. ఐదు కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇవ్వకపోతే బిల్లులు రావని తేల్చేశారు. దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు.
ఏపీ గిరిజన సంక్షేమ శాఖలో ఈఎన్సీ ఏసీబీ వలలో పడ్డారు. తన కార్యాలయంలోనే ఓ బ్యాగులో పాతిక లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. రూ.35 కోట్ల బిల్లుల మంజూరుకు ఐదు కోట్ల లంచం అడిగారు. అడ్వాన్సుగా పాతిక లక్షలు తన కార్యాలయంలో తీసుకున్నారు. ఈ అధికారి మరో వారం రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. గతంలో రెండు సార్లు ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని ఆయన ట్రాక్ రికార్డ్ చెబుతోంది.
ఇంతా ఘోరంగా లంచాలు వసూలు చేస్తూ దొరికిపోతున్న అధికారులు మళ్లీ మళ్లీ సర్వీసులోకి వస్తున్నారు. ప్రమోషన్లు పొందుతున్నారు. లంచాల మీద లంచాలు వసూలు చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం భయపడటం లేదు..బెరుకు ఉండటం లేదు. చర్యలు, శిక్షలు ఏమీలేకపోవడం … ఉన్నా అవి వేసే వ్యవస్థలు మేలుకోకపోవడంతో .. ఈ లంచగొండుల వ్యవహారం ఇష్టారాజ్యంగా మారుతోంది.