కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారి ఆస్తులు గుట్టలు, గుట్టలుగా బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు ఆస్తులు బహిరంగ మార్కెట్ లో అంచనా వేస్తే.. వేయి కోట్లకుపైగానే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఆయన. హైదరాబాద్ శివారులోని ఉన్న పదకొండు ఎకరాలే వేయి కోట్ల విలువ చేస్తాయి.
కాళేశ్వరం కమిషన్ ముందు అతి తెలివి సమాధానాలు చెప్పడంతో మురళీధర్ రావుపై ఏసీబీ గురి పెట్టింది. ఆయనకు సంబంధించిన పన్నెండు చోట్ల సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులు గుర్తించింది. కొండాపూర్‌లో ఒక విల్లా, బంజారాహిల్స్‌లో ఒక ఫ్లాట్, యూసుఫ్‌గూడలో ఒక ఫ్లాట్, బేగంపేటలో ఒక ఫ్లాట్, కోకాపేటలో భారీ ప్లాట్ ఉన్నాయి. మరో చోట పదకొండు ఎకరాలు ఉన్నాయి. ఇంకా బయటపడాల్సిన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో మరో మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాం ఇంటితో సహా 14 ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. ఆయన వద్ద కూడా తక్కువ దొరకలేదు. షేక్‌పేట్ కొండాపూర్‌లో రెండు లగ్జరీ విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగిలో మూడు ఫ్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం , సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండిళ్లు, బొమ్మలరామరం మండలంలో 6 ఎకరాల మామిడి తోటతో కూడిన ఫామ్‌హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం.. ఇంకా బోలెడన్ని ఆస్తులు, బంగారాన్ని పట్టుకున్నారు. హరిరామ్‌ను ఏసీబీ అరెస్టు చేసి జైలుకు పంపారు.
జూన్ కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంటిపైనా దాడులు చేశారు. నూనె శ్రీధర్ ఇంటితో సహా 14 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించారు. ఇది ప్రభుత్వ రేటు.. బహిరంగ మార్కెట్ లో ఐదు వందల కోట్లకుపైగా విలువ ఉంటుంది. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ద్వారా సంపాదించిన సొత్తేనని అనుమానిస్తున్నారు. ఏసీబీ అధికారులు మొత్తం బయట పెట్టాల్సి ఉంది.