విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు మరో దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ యాక్సెంచర్ కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లుగా రాయిటర్స్ సంస్థ ప్రకటించింది. పన్నెండువేల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమని.. పది ఎకరాల స్థలం కేటాయించాలని యాక్సెంచర్ విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఐటీ పాలసీ నిబంధనలకు అనుగుణంగా భూమి కేటాయించాలని కోరింది.
యాక్సెంచర్ నుంచి వచ్చిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఏపీ ప్రభుత్వం యాక్సెంచర్‌ను విశాఖకు తీసుకు వచ్చేందుకు ఆసక్తితో ఉంది. ఆ సంస్థ గత ఐటీ కంపెనీలకు ఇచ్చిన రాయితీలే అడుగుతోందని అసాధారణమైన కోరికలేమీ కోరడం లేదని చెబుతున్నారు. త్వరలో ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
విశాఖను ఐటీ హబ్‌గా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. గూగుల్ వచ్చే నెలలో ఒప్పందం చేసుకుని డాటా సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. కాగ్నిజెంట్ కూడా అదే పనిలో ఉంది. ఇప్పుడు యాక్సెంచర్ కూడా వస్తోంది. ఇక నుంచి ఇండియాలో కొత్త క్యాంపస్ లు పెట్టాలనుకునే ఐటీ కంపెనీలకు విశాఖ ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందన్న అభిప్రాయం ఐటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఏర్పడుతోంది.