చిత్రసీమలో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఈ రోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ (అతడు ఫేమ్)కు స్వయానా సోదరుడు ఈ ముకుల్. తెలుగులో రవితేజతో ‘కృష్ణ’ సినిమాలో నటించారు. ఆ సినిమా ముకుల్ కు మంచి పేరు తీసుకొచ్చింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. అదుర్స్, కేడీ, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ తదితర చిత్రాల్లో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. అయితే ఆ తరవాత కొత్త విలన్ల రాకతో ఆయన హవా తగ్గింది.
బాలీవుడ్ లోనూ కొన్ని చిత్రాలు చేశారు. ‘దస్తక్’ ఆయన తొలి సినిమా. ఆ తరవాత పంజాబీ, ఒరియా, కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటించారు. 2022లో ‘అంత్ ది ఎండ్’ అనే చిత్రంలో చివరిసారి కనిపించారు. ఆ తరవాత అవకాశాలు తగ్గాయి. ఆరోగ్యం కూడా పాడైంది. కొంత కాలంగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.