లేడీ గెటప్పులు వేసిన హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్లలో నరేష్ ఒకరు. అప్పటి సూపర్ హిట్ కామెడీ సినిమాల్లో… ‘చిత్రం భళారే విచిత్రం’ ముందు వరుసలోనే ఉంటుంది. నరేష్ ని కామెడీ హీరోగా నిలబెట్టిన సినిమాల్లో అదొకటి. ఇప్పటికీ ఆ సినిమాని చూసుకొని, నవ్వుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనల్లో ఉన్నారు నరేష్. ఈ విషయాన్ని ఈ రోజు ఓ సినిమా ఫంక్షన్లో నరేష్ స్వయంగా ప్రకటించారు కూడా. సీక్వెల్ కి తగిన స్టఫ్ ఆ కథలో ఉందా, లేదా? అనేది పక్కన పెడితే.. ఒకప్పటి క్లాసిక్ ని మళ్లీ గుర్తు చేయడం మంచి ఆలోచనే. కాకపోతే… ఈ ప్రయాణం అంత ఈజీ కాదు.
నరేష్ మళ్లీ లేడీ గెటప్ వేస్తే అప్పటి గ్లామర్ వస్తుందా, రాదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరో యంగ్ హీరోతో ఆ గెటప్ వేయించి, నరేష్ సినిమా అంతటినీ నడిపిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. కాకపోతే.. హీరోలు లేడీ గెటప్పుల్లో అలరిస్తే ఈనాటి జనరేషన్ చూడ్డానికి రెడీగా లేరన్నది కూడా వాస్తవమే. ఇటీవల విశ్వక్ సేన్ ‘లైలా’ అనే ఓ సినిమాచేశాడు. అందులోనూ తనది లేడీ గెటప్పే. కానీ వర్కవుట్ కాలేదు. సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. లేడీ గెటప్పులకు కాలం చెల్లిపోయిందన్న విషయం నిరూపించిన సినిమా ఇది. మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తానంటే కష్టమే. బలమైన కథ ఉంటే తప్ప ఈ రూటులో వెళ్లకూడదు. కాకపోతే నరేష్ ఆలోచనలు నరేష్వి. ఆయన దేన్ని బలంగా నమ్ముతున్నారో..?
‘చిత్రం భళారే’లాంటి మరో నవ్వుల క్లాసిక్ ‘జంబలకిడి పంబ’. దానిక్కూడా సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉండేది. చిత్రం భళారే కంటే.. జంబలకిడి పంబకు సీక్వెల్ కి కావాల్సిన ముడి సరుకు వుంది. అల్లరి నరేష్ లాంటి వాళ్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది.
