హైదరాబాద్: రెండు దశాబ్దాలపైగా కష్టపడిన తర్వాత ఇప్పటికి తన లక్ష్యాన్ని చేరుకోగలిగానని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తనకొక గుర్తింపు, స్థానం లభించాయని అన్నారు. రామ్‌చరణ్-శ్రీను వైట్ల చిత్రం, రవితేజ కిక్-2, రాయల్ బెంగాల్ టైగర్ చిత్రాలు, బాలకృష్ణ డిక్టేటర్, నిఖిల్-కోనవెంకట్ శంకరాభరణంవంటి పెద్ద చిత్రాలలో ప్రస్తుతం నటిస్తున్నానని, మంచి పాత్రలు లభిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది వచ్చిన లౌక్యం చిత్రం తనకొక టర్నింగ్ పాయింట్ అని, ఆ చిత్రంలోని బాయిలింగ్ స్టార్ బబ్లు పాత్ర తనకిచ్చినందుకు శ్రీవాస్‌కు రుణపడిఉంటానని అన్నారు.
తాడేపల్లిగూడేనికి చెందిన పృథ్వీరాజ్ ఆంధ్రా యూనివర్సిటీనుంచి ఎకనామిక్స్‌లో పీజీ చేశారు. కాలేజి స్థాయినుంచి నాటకాలు వేస్తూ సినిమారంగంపై మోజు పెంచుకున్నారు. చెన్నైవెళ్ళి ప్రయత్నాలు చేయగా చేయగా 1992లో ఆ ఒక్కటి అడక్కు చిత్రంద్వారా మొదటి అవకాశం లభించింది. అక్కడ మొదలుపెడితే ఇప్పటివరకు దాదాపు వందకుపైగా చిత్రాలలో నటించారు. ఖడ్గం చిత్రంలోని 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో తొలి గుర్తింపు లభించింది. తన ప్రస్థానం అంత సాఫీగా ఏమీ జరగలేదని, చాలా కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. ఒక సమయంలో తిరిగి ఇంటికెళ్ళిపోదామని అనుకున్నానని తెలిపారు. అలనాటి క్యారెక్టర్ యాక్టర్, దివంగత ప్రభాకర్ రెడ్డి తనకు తొలినాళ్ళలో ఎంతో సాయం చేశారని, ఆయనవలనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. వేషాలు లభించని సమయాలలో తనకు హోటల్ రిసెప్షనిస్ట్, గెస్ట్ హౌస్, వీడియో షాప్‌లలో సూపర్‌వైజర్‌గా పనిచేశానని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో కృష్ణానగర్‌లో ఒక చిన్నరూమ్‌లో ఫ్రెండ్‌తో కలిసి ఉండేవాడినని, కిలో బియ్యంతో వారంరోజులు గడిపేవాళ్ళమని చెప్పారు. ఇప్పడు తాను స్థిరపడినట్లేనని ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న పృథ్వీరాజ్ అన్నారు.