మహిళల వస్త్రాధరణపై శివాజీ చేసిన కామెంట్స్, ఆ తరవాత జరిగిన పరిణామాలూ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ఈరోజు ఆయన మహిళా కమీషన్ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం వెనుక కుట్ర దాగుందని వ్యాఖ్యానించారు. తనతో పాటు కెరీర్ మొదలెట్టిన వాళ్లకు తనపై వ్యతిరేకత ఉందని, జూమ్ మీటింగులు పెట్టుకొన్నారని, ఇవన్నీ ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. అంతేకాదు… మంచి మాటలు చెప్పకూడదు, సలహాలు ఇవ్వకూడదన్న నిజం ఈ ఉదంతంతో తెలిసొచ్చిందన్నారు. “ఓ తండ్రి స్థానంలో ఉండి సలహాలు ఇద్దామనుకొన్నా. ఈలోకంలో అందరికీ అన్నీ తెలుసు. సలహాలు ఇవ్వడానికి నేనెవర్నీ..” అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.
అంతే కాదు.. ”నేను ఎవడికో భయపడే రకాన్ని కాదు. బతుకు తెరువుకి వచ్చినవాడ్ని.. ఇక్కడ కాకపోతే.. మరో చోట బతుకుతా. నేను రైతు బిడ్డని. వ్యవసాయం చేసుకొని బతుకుతా. ఇది పొగరు కాదు, ఆత్మాభిమానం. ఎవరు కుట్ర పన్నుతున్నారో కనిపిస్తూనే వుంది. అయినా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం” అన్నారు. మహిళా కమీషన్ ముందు తన వివరణ ఇచ్చేశానని, అవసరం అయితే మళ్లీ వస్తానని చెప్పుకొచ్చారు శివాజీ. సినిమా ప్రమోషన్ల కోసం చీప్ గా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, సినిమాలపై మోజు ఉంటే 12 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉండేవాడ్ని కాదని, రాజకీయాలపై ఆసక్తి ఉంటే, ఎప్పుడో మంచి పొజీషన్ లో ఉండేవాడినన్నారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లపై స్పందన ఏమిటి? అని అడిగితే ”నేను అవేం చూడలేదు.. వాటిపై మాట్లాడలేను” అన్నారు.