‘అనుష్క పెళ్లి’పై వచ్చినన్ని వార్తలు మరే కథానాయికపై రాలేదేమో? ఏడాదికి నాలుగు సార్లైనా ఇలాంటి వార్త ఒకటి బయటకు వస్తుంది. ఆ తరవాత అంతా గప్ చుప్. అనుష్క కూడా పెళ్లి మాట ఎత్తితే ‘చూద్దాం.. చూద్దాం’ అంటుంది తప్ప.. చేసుకోవడం కనిపించదు. ఇప్పుడు మళ్లీ స్వీటీ వార్త బయటకు వచ్చింది. అనుష్క పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈసారి మాత్రం మేటర్ సీరియస్స్ అట. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త కుమారుడితో స్వీటీ పెళ్లి జరగబోతోందన్నది గట్టిగా వినిపిస్తున్నమాట.
అనుష్క వయసు ప్రస్తుతం 44 ఏళ్లు. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కొంతకాలంగా ఆమె మీడియా ముందుకు రావడం లేదు. సినిమాలు కూడా బాగా తగ్గించేసింది. ‘బాహుబలి’ తరవాత పెద్దగా కనిపించడం లేదు. ఆమధ్య ‘ఘాటీ’ సినిమా చేసింది. ఆ సినిమా ప్రమోషన్లకు కూడా స్వీటీ రాలేదు. కొత్త కథలు కూడా ఒప్పుకోవడం లేదు. దర్శక నిర్మాతలెవరికీ అందుబాటులో లేకుండా పోయింది. అనుష్క సొంత వ్యాపారాలు మొదలు పెడుతోందని చెప్పుకొన్నారు ఆమధ్య. ఇప్పుడు పెళ్లి అంటున్నారు. ఈసారైనా ఈ వార్త నిజం అవ్వాలన్నది అభిమానుల ఆకాంక్ష. పెళ్లి మాటే నిజమైతే, అనుష్క నుంచి త్వరలోనే ఓ శుభవార్త కూడా వినొచ్చు.


