‘ఈశ్వర్’ సినిమా ఇద్దరు సినీ వారసులను పరిచయం చేసింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి ప్రభాస్ కథానాయకుడిగా వచ్చారు. ఇదే సినిమాతో నటుడు విజయ్‌కుమార్ కుమార్తె శ్రీదేవి కూడా కథానాయికగా తెరపైకి వచ్చింది. ఈశ్వర్ ఈ ఇద్దరికీ గొప్ప ఆరంభం ఇచ్చింది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. శ్రీదేవికి హీరోయిన్గా మంచి అవకాశాలే వచ్చాయి. అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఇప్పుడు నారా రోహిత్ సుందరకాండతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది శ్రీదేవి. “ప్రభాస్‌గారితో ఫ్రెండ్షిప్ అలానే ఉంది. ఇప్పుడు ఆయన బిగ్ స్టార్ అయ్యారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ కూడా ఆయన చిన్నపిల్లాడిలానే నవ్వుతూ మాట్లాడతారు. కొన్ని మాటలు అర్థం కూడా కావు (నవ్వుతూ). ఈశ్వర్ సినిమా సమయంలోనే ఆయన పెద్ద సూపర్‌స్టార్ అవుతారని అనుకున్నాం. ఆ సినిమా సక్సెస్ టూర్‌కి వెళ్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున జనం వచ్చేవారు. అప్పుడే బోలెడు మాస్ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఊహించినదానికంటే ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఈ విషయంలో ఆయన తొలి కథానాయికగా చాలా ఆనందపడతాను” అన్నారు శ్రీదేవి. సుందరకాండ ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.