కథానాయికల్ని ‘కూర’లో కరివేపాకులా భావిస్తుంటారు కొంతమంది. నేమూ, ఫేమూ ఉన్నప్పుడే వాళ్ల వెలుగులు అనుకొంటారు. స్టార్ హీరోతో అవకాశం అనగానే ఎగరి గంతేస్తారు, వాళ్లకు పెద్దగా షరతులేం ఉండవు అనిపిస్తుంటుంది. కానీ అందరూ అలా ఉండరు. తమ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు. ఓ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలా, వద్దా? అనే విషయాల్లో చాలా స్పష్టతతో ఉంటారు. యువ హీరోల పక్కన నటించేటప్పుడు ఉన్న ఉత్సాహం.. వయసు మళ్లిన వెటరన్ హీరోలతో చేస్తున్నప్పుడు ఉండదు. ఈమధ్య చాలామంది కథానాయికలు ఓ సినిమా ఒప్పుకొనే ముందు తమ పాత్ర, కథలోని వైవిధ్యం కంటే – ‘హీరో వయసు’ గురించి కూడా ఆరా తీయడం చాలా కామన్ అయిపోయింది. తమ కంటే డబుల్, త్రిపుల్ వయసున్న హీరోలతో సినిమా అంటే `ససేమీరా` అనేస్తున్నారు. డైరెక్ట్‌గా సినిమా రిజెక్ట్ చేస్తే ఆ హీరోతోనో, ఆ ప్రొడక్షన్ హౌస్లతోనో భవిష్యత్తులో తలనొప్పులు ఉంటాయి. అందుకే తెలివిగా పారితోషికం పేరుతో బెదిరిస్తున్నారు.
రీసెంట్ గా ఓ అగ్ర హీరో సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ ని సంప్రదించింది చిత్రబృందం. ‘నటిస్తా.. కానీ నా పారితోషికం రూ.10 కోట్లు ఇస్తారా’ అంటూ షరతు పెట్టింది. ఓరకంగా ‘పొమ్మనక పొగబెట్టే’ వ్యవహారం ఇది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు రూ.10 కోట్లు ఇవ్వడం అంటే పెద్ద విషయమే. కాబట్టి… వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే. ఒకవేళ ఆ పది కోట్లూ ఇస్తానంటే, అప్పుడు ఆ హీరోయిన్ని అభ్యంతరాలు ఉండవు. రెండు సినిమాల్లో నటిస్తే వచ్చే పారితోషికం ఒక్క సినిమాకే అందుకొంటుంది కాబట్టి, ఇప్పుడు హీరో వయసుతో పనేం ఉండదు. ఇలాంటి ఉదాహరణలు బోలెడన్ని కనిపిస్తాయి.
ఓ యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ కోసం హీరోయిన్ కాల్షీట్లు అడిగాడు నిర్మాత. ఆ యంగ్ హీరో సినిమా అంటే.. లిప్ లాకులు తప్పని సరి. కనీసం ఒకటో, అరో లేకపోతే – ఆ సినిమా పూర్తవ్వదు. ‘లిప్ లాక్స్ ఉంటాయి కాబట్టి పారితోషికం పెంచాలి’ అంటే బాగోదు కాబట్టి, ముందే పారితోషికం పెంచేసింది. `అది లిప్ లాకులతో కలిపి` అని సదరు నిర్మాత అర్థం చేసుకొన్నాడు. దాదాపు హీరోయిన్లు అందరూ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. `నో` చెప్పడం కంటే పారితోషికం బూచితో భయపెడితే… నిర్మాతలే అర్థం చేసుకొంటారని, ఒకవేళ అడిగినంత ఇస్తే – తమ మార్కెట్ పెంచుకొన్నట్టు అవుతుందని ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.