డేటా సెంటర్ కోసం గూగుల్ తో ఒప్పందం జరిగిన తర్వాత తాము ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నామని అదాని గ్రూప్ ప్రకటించింది. అలాగే ఎయిర్ టెల్ కూడా అదే విధమైన ప్రకటన చేసింది. దీంతో చాలా మంది ఈ ప్రాజెక్టులో అదాని, ఎయిర్టెల్ కూడా భాగస్వాములు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి గూగుల్ ఇతర సంస్థలతో ఎలాంటి పార్టనర్ షిప్ తీసుకోదు. కానీ అదాని, ఎయిర్ టెల్ విశాఖ డేటా సెంటర్ లో భాగస్వామ్యం అవుతున్నాయి. కానీ అది యాజమాన్యంలో కాదు.. కేవలం పనుల విషయంలోనే.
గూగుల్ డేటా సెంటర్ కు కేటాయించిన లక్షా ఇరవై వేల కోట్ల పెట్టుబడిలో కనీసం నలభై వేల కోట్ల రూపాయల వరకూ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఖర్చు పెడతారు. అదానీ గ్రీన్ ఎనర్జీ రంగంలో గూగుల్ డేటా సెంటర్ ప్రణాళికల్ని అమలు చేస్తుంది. ఆ బాధ్యతలు తీసుకుంటుంది. ఎయిర్ టెల్ .. ఇంటర్నెట్ కేబుల్స్ తోపాటు తాము సర్వీసులు అందించే అంశాల్లో గూగుల్ అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాజెక్టులో ఈ రెండు కంపెనీలు తమ తమ సేవలు అందిస్తాయి. దానికి తగ్గట్లుగా గూగుల్ వారికి చెల్లింపులు చేస్తుంది. అంతే కానీ గూగుల్ లో వారు భాగస్వామ్యం కాలేదు.
అయితే అత్యుత్సాహంతో కొంత మంది అదానీ గతంలో డేటా సెంటర్ పెట్టడానికి పెద్ద ఎత్తున భూములు తీసుకుంది ..ఇప్పుడు గూగుల్ తో కలిసి పెడుతోందా అని ప్రశ్నిస్తున్నారు. కానీ అదానీ డేటా సెంటర్ ప్రణాళికలు అలాగే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ భూముల్లో ఇంకా నిర్మాణలు ప్రారంభించలేదు. దీనిపై రేపోమాపో అదానీ గ్రూపు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.