తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులకు కారణమవుతున్నాయి. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి తాజాగా మాస్టర్ ప్లాన్‌కు కేంద్రం ఆమోదం తెలపడం, సుమారు 700 ఎకరాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. ఎయిర్‌పోర్టు వస్తుందన్న వార్తలతో స్థానిక భూముల ధరలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ ప్రాంతంలో కేవలం నివాస స్థలాలకే కాకుండా, భవిష్యత్తులో రాబోయే పరిశ్రమలు, లాజిస్టిక్ హబ్‌లను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీని వార్తలతో ఈ ప్రాంతం చుట్టుపక్కల భూముల విలువలు గడిచిన కొద్దికాలంలోనే సుమారు 74 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. వరంగల్, రామగుండం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే, ఆయా జిల్లాల ముఖచిత్రమే మారిపోనుంది. విమానాశ్రయం అనే మౌలిక సదుపాయం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధాన గ్రోత్ ఇంజిన్ గా మారుతుండటంతో, సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అందరి చూపు ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ జోన్లపైనే ఉంది.
