మే నెల బాక్సాఫీస్‌కి ‘హిట్ 3’తో జోష్ వచ్చింది. ఈ సినిమా రూ.100 కోట్ల మైలు రాయిని దాటింది. ఓరకంగా నాని రేంజ్ పెంచిన సినిమా ఇది. ‘హిట్ 3’ సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్ మరో ఎత్తు. క్లైమాక్స్ లోనే చాలా సర్ప్రైజ్లు ఒకదాని తరవాత మరోటి వస్తుంటాయి. అందులో అడవిశేష్ ఎంట్రీ ఒకటి. ‘హిట్ 2’లో శేష్ హీరో. ఆ పాత్రని ‘హిట్ 3’లో గెస్ట్ గా తీసుకొచ్చారు. ఈ ఎత్తుగడ ఫలించింది. అడవి శేష్ రాకతో క్లైమాక్స్ కి ఓ కొత్త ఊపు వచ్చింది. నిజానికి శేష్ మాస్ హీరో కాదు. కానీ తన ఎంట్రీకి మాస్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది.
నిజానికి శైలేష్ అడవిశేష్ తో పాటుగా విశ్వక్ నీ స్క్రీన్‌పై చూపిద్దామనుకొన్నాడు. హిట్ 1, 2, 3 హీరోలు ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లోకి రావాల్సిన సీన్ అది. కానీ అదే సమయంలో విశ్వక్ మరో షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. అడవిశేష్ ఒక్కడే ఆ సమయానికి దొరికాడు. ఓరకంగా శేష్‌కి ఇది ప్లస్ అయ్యింది. తన రాబోయే సినిమాలు ‘డెకాయిట్’, ‘గూఢచారి 2’ సినిమాలకు ఈ కామియో మరింత ఊపు ఇచ్చింది. శేష్ కూడా వెండి తెరపై కనిపించి చాలాకాలం అయ్యింది. ఆలోటు కూడా హిట్ 3తో తీరింది. ఇక చివర్లో కార్తీ కామియో గురించి చెప్పాల్సిన పనిలేదు. విందు భోజనం తరవాత మంచి పాన్ తిన్న ఫీలింగ్ ఇచ్చిన మూమెంట్ అది.
‘హిట్ 4’లో కార్తీ ఆల్రెడీ ఫిక్సయ్యాడు. హిట్ 5లో ఒక హీరో, 6లో మరో హీరో. ఈ ఏడుగురు హీరోల్ని కలిపి హిట్ 7 లో కనిపిస్తారు. హిట్ 7 రావాలంటే కనీసం మరో నాలుగేళ్లయినా పడుతుంది. నాని ఐడియా ఏమిటంటే… శైలేష్ ఎన్ని సినిమాలు చేసినా ప్రతీ యేడాది హిట్ ఫ్రాంచైజీ నుంచి ఓ సినిమా తీసుకురావాలని అనుకొంటున్నాడు. అన్నీ కథలు శైలేష్ దగ్గర ఉన్నాయా? అనేది పెద్ద ప్రశ్న. శైలేష్ కూడా జోనర్ మార్చాలన్న ఆలోచలో ఉన్నాడు. తను త్వరలోనే వెంకటేష్ తో ఓ వినోదాత్మక చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడని టాక్. అది హిట్టయితే.. శైలేష్ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎలా మారతాయో?