డిసెంబరు 25న డెకాయిట్ రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని రెండు నెలల ముందే ప్రకటించేశాడు శేష్. దాంతో డిసెంబరు 25న రావడానికి మిగిలిన సినిమాలకు కాస్త సమయాన్ని ఇవ్వగలిగాడు. ఎందుకంటే డిసెంబరు 25 మంచి డేట్. క్రిస్మస్ సెలవలు కలిసొస్తాయి. ఇలాంటి డేట్ ని నిర్మాతలు మిస్ చేసుకోరు. డెకాయిట్ ఎప్పుడైతే వాయిదా పడిందో అప్పుడు ‘చాంపియన్’ సినిమాకు దారి దొరికినట్టైంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, స్వప్న సినిమాస్ రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. డిసెంబరు 25న వస్తోంది. దాంతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘టైసన్ నాయుడు’ చిత్రాన్నీ డిసెంబరు 25నే విడుదల చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు సినిమాలు సైతం, ఈ సీజన్లో రావడానికి రెడీ అవుతున్నాయి.
ఈరోజుల్లో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం, ఆ తరవాత వాయిదా వేయడం కామన్. కాకపోతే.. ‘వాయిదా’ అనే విషయాన్ని ఆయా నిర్మాతలు, హీరోలు చాలా లేట్ గా చెబుతున్నారు. ఒక వారం ముందో, రెండు రోజుల ముందో ‘మేం అనుకొన్న సమయానికి రాలేకపోతున్నాం’ అని ఓ పోస్టరో, ట్వీటో వదులుతున్నారు. దాని వల్ల.. ఎవ్వరికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఆ స్లాట్ అలా ఖాళీగా ఉండిపోతోంది. మిగిలిన సినిమాలు రెడీ అయ్యే సమయం దక్కడం లేదు. కానీ శేష్ మాత్రం రెండు నెలల ముందే… తన స్లాట్ ఖాళీగా ఉందని చెప్పేసుకొన్నాడు. దాంతో మిగిలిన సినిమాలు ఆ డేట్ ని క్యాష్ చేసుకోవడానికి తగిన సమయం దొరికినట్టైంది. మిగిలిన హీరోలు, నిర్మాతలూ రిలీజ్ డేట్ విషయంలో మిగిలిన నిర్మాతలకు ఇలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.