పెట్టుబడి కోసం మెట్రో నగరాల్లో ఇళ్ల కొనుగోలు అతిపెద్ద తప్పిదం అవుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో అస్థిరత , స్పెక్యులేషన్ ఆధారిత మార్కెటింగ్ తో పాటు అధిక ధరలు, రిటర్నులు వచ్చే చాన్స్ లేకపోవడాన్ని కారణాలుగా చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ బిల్డర్ల ఆధీనంలో ఉంటుంది. దీనివల్ల ధరలు అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి.
గతంలో స్వంత భూమిపై ఇళ్లు నిర్మించుకునే సంప్రదాయం ఉండగా, ఇప్పుడు బిల్డర్లు రెడీమేడ్ ఇళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇది కృత్రిమంగా ధరను పెంచడం తప్ప రియల్ వాల్యూ కాదని నిపుణుల భావన. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న నగరాలకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం లేదు. ట్రాఫిక్, నీటి కొరత, ఇతర సమస్యలతో నివాసయోగ్యత తగ్గిపోతోంది. నిరంతరం కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో, పాత ఇళ్లను విక్రయించడం కష్టమవుతోంది, దీనివల్ల పెట్టుబడి లిక్విడిటీ తగ్గుతోందని అంటున్నారు. ఈ కారణాల వల్ల పెట్టుబడి కోసం మెట్రో నగరాల్లో ఇళ్లు కొనడం సరి కాదని చెబుతున్నారు.
అదే సమయంలో ఇల్లు కొనాలనుకుంటే, దీర్ఘకాలికంగా అంటే కనీసం 30 సంవత్సరాలు నిలిచే ఆస్తిని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాంటి ఆలోచన లేకపోతే.. అద్దెకు ఉండటమే మంచిదని అంటున్నారు. 2021 నుంచి గురుగ్రామ్‌లో ఇళ్ల ధరలు మూడు రెట్లు పెరిగాయి. దీనికి కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు స్కీమ్‌ల ద్వారా తక్కువ డౌన్ పేమెంట్‌తో బహుళ అపార్ట్మెంట్లను బుక్ చేస్తారు. అంటే కృత్రిమ డిమాండ్ ను సృష్టించి.. రేట్లను పెంచి అమ్ముతారన్నమాట. అయితే ఇలాంటి వారి వల్ల రేట్లు పెరుగుతాయి కానీ.. డిమాండ్ పెరిగే అవకాశం ఉండదు.
అందుకే మెట్రో సిటీల్లో ఉండటానికి మాత్రం మంచి ఇల్లు కొనుగోలు చేయవచ్చు కానీ.. పెట్టుబడి కోసం అయితే ఇతర మార్గాలు మంచిదని సలహాలిస్తున్నారు.