ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. ప్రత్యేక హోదాపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన, రాష్ట్రంలో తదనంతర రాజకీయ పరిణామాలు, వాటివలన తెదేపా, భాజపాలకి కలుగుతున్న నష్టం, వాటి మధ్య తలెత్తుతున్న అభిప్రాయబేధాలు, ప్రజల సెంటిమెంటు, ఇతర హామీల అమలు వగైరా అన్ని విషయాలు ఆయనకి తెలియజేసి వీటిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే, దీనిపై నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి మీడియాకి తెలిపారు.
ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి మధ్య జరిగిన సమావేశం గురించి తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా అంటే ఏమిటో, దాని వలన రాష్ట్రానికి ఏమి ప్రయోజనమో తెలియకపోయినా రాష్ట్రంలో ఆరేళ్ళ పాప మొదలు అరవై ఏళ్ల ముసలమ్మ వరకు అందరూ ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు. అది ఒక సెంటిమెంటుగా మారిపోయింది. కనుక ఇంకా దానిపై నిర్ణయం తీసుకోకుండా నాన్చితే రెండు పార్టీలు ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని ముఖ్యమంత్రి ప్రధానికి స్పష్టం చేశారు. అప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు. మీ కష్టం నా కష్టంగా భావించి ఈ సమస్యని పార్లమెంటు సమావేశాలు ముగియగానే పరిష్కరిస్తానని చెప్పారు. కనుక అంతవరకు వేచి చూడక తప్పదు,” అని అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే స్పష్టం చేశారు కనుక ఇస్తామని కూడా పార్లమెంటులోనే ప్రకటిస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ రాష్ట్రాల సభ్యులు కూడా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా కోరుతున్నాయి కనుక ఇప్పుడు పార్లమెంటులో ప్రకటన చేసి దాని కోసం బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా బయటపడుతుంది. తద్వారా రాష్ట్రంలో తెదేపా, భాజపాలకి నష్టనివారణ జరుగుతుంది కూడా.
ఒకవేళ ఏవైనా కారణాల వలన పార్లమెంటులో ఇప్పుడు ప్రకటించకపోయినా, ఆ తరువాతైన ప్రధాని నరేంద్ర మోడీ తన హామీని నిలబెట్టుకొంటే మంచిదే. కానీ పార్లమెంటు సమావేశాలలో ప్రత్యేక హోదా ఇస్తామని మాటిస్తే ఇక తప్పించుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతోనే, అవి ముగిసిన తరువాత నిర్ణయం తీసుకొంటానని చెప్పి, అప్పటికి ఈ వేడి చల్లారిపోతుందని కనుక తప్పించుకోవచ్చని భావిస్తే, దాని వలన భాజపాకి, ముఖ్యమగా ప్రధాని నరేంద్ర మోడీకి చెడ్డపేరు వస్తుంది. ప్రజలలో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందే కానీ తగ్గదు. అంతేకాదు, రాష్ట్రంలో తెదేపాపై ఒత్తిడి పెరిగిపోతే అది తప్పనిసరిగా భాజపాతో తెగతెంపులు చేసుకోవలసి వస్తుంది. అప్పుడు రాష్ట్రంలో అది కూడా దానికి శత్రువుగా మారుతుంది. కనుక ఈసారి మోడీ మాట తప్పరనే భావించవచ్చు.