పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్‌ల కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఈ దోస్త్ లిద్దరూ కలిస్తే బాక్సాఫీసుకి పండగే. జల్సా డీసెంట్ హిట్ కొడితే, అత్తారింటికి దారేది రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ మరోసారి జట్టు కట్టారు. ఈరోజే.. పవన్ – త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీ లాంఛనంగా మొదలైంది. సంగీతం, కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్.. ఇలా టెక్నీషియన్లంతా సెట్టయిపోయినా హీరోయిన్లు మాత్రం ఖరారు కాలేదు. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. ఈసారీ ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చిత్రబృందం ప్రకటించింది. జల్సాలో ఇలియానాతో పాటు, పార్వతీ మెల్టన్ కథానాయిక పోస్ట్‌ని పంచుకొంది. అత్తారింటికి దారేదిలో సమంత, ప్రణీతలు షేర్ చేసుకొన్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఇద్దరు హీరోయిన్ల ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారన్నమాట.
ఇద్దరు హీరోయిన్లున్నా.. రెండో వాళ్లు డమ్మీలుగానే మిగిలిపోవాల్సివస్తోంది. జల్సాతో పార్వతీ మెల్టన్కీ, అత్తారింటికి దారేదితో ప్రణీతకూ ఒరిగిందేం లేదు. ఆ మాట కొస్తే ఆయా సినిమాల తరవాత వాళ్లు మరింత డల్ అయిపోయారు. ఈసారి త్రివిక్రమ్ ఏ హీరోయిన్ని బకరా చేస్తాడో మరి. ఓ కథానాయికగా సమంతని ఎంచుకొన్నారన్న వార్తలొచ్చినా అదంతా ఒట్టి పుకారే అని తేలింది. పవన్ పక్కన ఇది వరకు నటించని కథానాయికే ఉంటుందని సన్నిహిత వర్గాలు ఓ హింట్ ఇచ్చేశాయి. సో… తెరపై కొత్త కాంబినేషన్‌ని చూడొచ్చన్నమాట.