ప్రముఖ ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన వివరాల ప్రకారం ఆహా నష్టాలు రూ. 92 కోట్లు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఈ నష్టాలు కేవలం రూ. 26 కోట్లకు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అనూహ్యంగా ఈ ఏడాది నష్టాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇదే సమయంలో ఆహా మంచి పనితీరు కనబర్చింది. ఆపరేటింగ్ రెవిన్యూ రూ. 26 కోట్ల నుంచి రూ. 76 కోట్లకు పెరిగింది. కానీ ఖర్చుల్లో అదుపు లేకపోవడంతో ఆదాయాన్ని మించి నష్టాలు చూడాల్సి వచ్చింది.
మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఖర్చు రూ. 200 కోట్లకు చేరింది. ఈ ఖర్చులో అత్యధికంగా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్ పెన్సెస్ కింద అత్యధికంగా రూ.74 కోట్లు ఖర్చు చూపించారు. అంటే ఉద్యోగుల కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్లుగా అర్థమవుతుంది. కంటెంట్ ఇతర సాంకేతిక అంశాలపై రూ. 109 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క కంటెంట్ కోసం ఇందులో రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఆహాకు లభిస్తున్న అత్యధిక ఆదాయం సబ్ స్క్రిప్షన్స్ మీదనే వస్తోంది. మొత్తంగా ఆహాకు వచ్చిన ఆదాయం రూ. 76 కోట్లలో రూ. 68 కోట్ల వరకూ చందదారుల కారణంగానే వచ్చింది. ఇతర ఆదాయాల సోర్స్ పరిమితంగానే ఉంది. శాటిలైట్ రైట్స్ అమ్మడం ద్వారా రూ. ఐదున్నర కోట్లు, మరో రెండున్నర కోట్లు సిండికేషన్ రెవిన్యూ ద్వారా వచ్చాయి. ఆహా ఫ్లాట్ ఫామ్ తెలుగులో రిజినల్ లాంగ్వేజ్‌లో బాగా పట్టు సాధించింది. ఇటీవల తమిళంలోనూ ప్రారంభించడంతో ఖర్చులు పెరిగాయి.
గీతా ఆర్ట్స్, మైహోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్ గా ప్రారంభించారు. ఓటీటీ మార్కెట్ ఇప్పుడే పుంజుకుంటూడటంతో పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని ఆహా యాజమాన్యం నమ్మకంతో ఉంది. కొత్త సీఈవోగా రవికాంత్ సబ్నవిస్‌ను నియమించారు. ఇప్పటి వరకూ సీఈవోగా ఉన్న అజిత్ ఠాకూర్‌ను డైరక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. రవికాంత్ స్టార్ టీవీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి ప్రముఖ సంస్థల్లో పని చేశారు.