సరికొత్త ఆలోచనలతో వైవిధ్యమైన కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న 100% లోకల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’. ఎప్పటికప్పుడు సరికొత్త, విలక్షణమైన అంశాలతో ఆడియెన్స్‌ను అలరిస్తోన్న ఈ ఓటీటీ మాధ్యమం తాజాగా ‘న్యూ సెన్స్ సీజన్ 1’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్‌లోని ఆర్.కె.సినీ ప్లెక్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నవదీప్, బిందు మాధవి, డైరెక్టర్ శ్రీప్రవీణ్, నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నిర్మాత వివేక్ తదితరులు పాల్గొన్నారు. ‘న్యూ సెన్స్’ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మీడియాకు సంబంధించిన మరో కోణాన్ని ఇది ఆవిష్కరిస్తుంది. సెన్సేషనల్ న్యూస్‌ను ప్రజలకు అందించే క్రమంలో ముఖ్యమైన విషయాలను ఎలా పరిష్కరించాలనే విషయాన్ని ఇందులో చూపిస్తున్నారు. అంటే వార్తల్లోని నిజా నిజాలు, ప్రతి కూల వార్తల ప్రభావం ఎలా ఉంటుందో చూపెడుతున్నారు.
సరికొత్త ఆలోచనను రేకెత్తించే కథాంశాలను అందిస్తూ ఆహా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ప్రస్తుతం మనం ఉంటున్న సమాజం, అందులోని పరిస్థితులను ఆవిష్కరించేలా కథనాలను అందిస్తోంది ఆహా. అలాంటి కథనానికి న్యూసెన్స్ సిరీస్ మినహాయింపు కాదు. ప్రేక్షకులను మెప్పించేలానే కాకుండా మీడియాను ఆకట్టుకునేలా ఆత్మ పరిశీలన చేసుకునేలా న్యూసెన్స్ ఉండనుంది.
కీలకమైన సమస్యను ఎత్తి చూపేలా రూపొందించిన న్యూసెన్స్ షో గురించి నవదీప్ మాట్లాడుతూ ‘‘నేటి సమాజంలో మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి దానిపై ఓ ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరిచేలా రూపొందిన న్యూసెన్స్‌లో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సిరీస్ ప్రారంభం నుంచి చివరి ఆడియెన్స్‌ను ఈ సిరీస్ అలా కట్టిపడేస్తుంది’’ అన్నారు.
బిందు మాధవి మాట్లాడుతూ ‘‘నటీనటులుగా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉండేలానే చూసుకోవటమే కాదు, అందరిలో ఓ పాజిటివ్ దృక్పథాన్ని పుట్టించేలా ఉండే కంటెంట్‌ను క్రియేట్ చేయటం మా బాధ్యత. కచ్చితంగా అలాంటి ప్రభావాన్ని న్యూసెన్స్ సిరీస్ కలిగిస్తుందనే భావన ఉంది. అంతే కాదు.. నేటి మీడియా రంగం సమాజంపై చూపుతోన్న ప్రభావంపై ఆందోళన చెందేవారందరూ తప్పనిసరిగా ఈ సిరీస్‌ను చూడాల్సిందే’’ అన్నారు.
ఈ సిరీస్ టీజర్ విడుదలైనప్పుడు ‘డబ్బుకి మీడియా దాసోహమా?’ అనే కమ్యూనికేషన్ లైన్ ప్రేక్షకుల్లో ఓసెన్సేషన్ను క్రియేట్ చేసింది. నిజంగానే డబ్బుకి మీడియా దాసోహమైందా? బానిసగా మారిందా? అనే ప్రశ్న మన మదిలో వస్తుంది. అంతే కాకుండా మీడియాలో ప్రసారమవుతున్న వార్తల ప్రామాణికతకు సంబంధించిన ప్రశ్న మనసులో రావటమే కాకుండా, సమాజంపై మీడియా ప్రభావం గురించి ఆందోళన చెందుతున్న వారిపై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. న్యూసెన్స్ సిరీస్ ద్వారా చెప్పిన మెసేజ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పటికే ఇది ఆడియెన్స్‌తో పాటు మీడియాను కూడా ఆకర్షించింది. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మన సమాజంలో మీడియా పాత్రను న్యూసెన్స్ సిరీస్ రూపంలో ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు శ్రీప్రవీణ్ మాట్లాడుతూ ‘‘మన సమాజం ఎలా ఉంది. దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలను తెలియజేయటం ఓ క్రియేటర్‌గా నా బాధ్యత. న్యూస్ స్ట్రింగర్స్ ప్రపంచంలోకి వెళ్లి లోతుగా అధ్యయనం చేసేలా ఉండేదే ఈ న్యూసెన్స్ సిరీస్. అలాగే న్యూస్ రిపోర్టింగ్‌లో ఉండే విలువలను ప్రశ్నించేలా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా, నిజాయతీతో ఓ రంగానికి సంబంధించిన విషయాలను చూపించేలా రూపొందిన ఈ సిరీస్ ఆడియెన్స్‌కు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.
మంచి నటీనటులు, నిర్మాణ విలువలు, డిఫరెంట్ స్టోరీ లైన్‌తో రూపొందిన న్యూసెన్స్ సిరీస్ తెలుగు వినోద రంగంలో ఓ పెద్ద మార్క్‌ను క్రియేట్ చేస్తుందనటంలో సందేహం లేదు.
కాంప్రమైజ్ కాకుండా బోల్డ్ స్టోరీ టెల్లింగ్‌తో న్యూసెన్స్ సీజన్ 1 రూపొందింది. మన సమాజంపై మీడియా పాత్ర ఎలా ఉందనే ఆలోచించేవారు తప్పకుండా చూడాల్సిన సిరిస్. ఆహాలో మే 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.