అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమాన ప్రమాదానికి కారణం స్పష్టమయింది. విమానం గాల్లోకి ఎగిన సెకన్లలోనే ఇంజిన్లకు ఇంధనం సరఫరా చేసే వ్యవస్థను ఆపేశారు. ఒకటి కాదు.. రెండు ఇంజిన్లకూ ఇంధన ఆగిపోయింది. అప్పుడే గాల్లోకి ఎగరడంతో తదుపరి చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమయం కూడా పైలట్లకు దొరకలేదు. మొదటి పైలట్.. ఇంజిన్‌కు ఇంధనం ఎందుకు ఆపేశావని అడిగితే.. రెండో పైలట్ తాను ఆపేయలేదని చెప్పినట్లుగా బ్లాక్ బాక్సుల్లో నమోదు అయింది. పైలట్లు ఇద్దరూ ఇంధనాన్ని ఇంజన్లకు వెళ్లకుండా ఆపలేదు. మరి ఎందుకు ఆగిపోయింది ?
విమానంలో ఎలాంటి సమస్య లేదని తేలింది. అదే సమయంలో ఇందులో కుట్ర కోణం ఉందని కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకే ఒక్క కారణంతో కుప్పకూలింది. గాల్లోకి ఎగిరిన వెంటనే ఇంజన్లకు ఆయిల్ అందకపోవడంతోనే కుప్పకూలింది. ఇలా జరగడం అసాధారణం. టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే..విమానం గాల్లోకి ఎగరాలంటే.. గ్రౌండ్ స్టాఫ్ , టెక్నిషియన్లు అందరూ అన్ని పార్టులను చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ రహస్యం తెలుసుకోవడం అత్యంత కీలకం. కానీ అంతా బూడిద అయిపోయినందున తెలుసుకోవడం అసాధ్యమని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక మాత్రమే వచ్చింది. పైలట్ల దగ్గరే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని ఎక్కువ మంది ప్రాథమిక నివేదికను బట్టి నమ్ముతున్నారు. పొరపాటున ఇంధనాన్ని ఇద్దరు పైలట్లలో ఒకరు ఆపేసి ఉంటారన్న అనుమానాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ఆధారాలు లేవు. మరో వైపు ప్రాథమిక నివేదికతోనే ఎలాంటి కంక్లూజన్ కు రావొద్దని.. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే స్పష్టత వస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.