సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ విప్లవం తీసుకొస్తున్న మార్పులు ఉద్యోగుల్లో పెను ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టెక్ కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తుండటం, కృత్రిమ మేధ వల్ల పని సామర్థ్యం పెరిగి మానవ వనరుల అవసరం తగ్గుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు వెన్నెముకగా ఉన్న ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తిపై నేరుగా దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుందనే నమ్మకం లేకపోవడంతో, కొత్త ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనేందుకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు వెనుకాడుతున్నాయి.
తగ్గుతున్న డిమాండ్ – పెరుగుతున్న ఇన్వెంటరీ
రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఒకవేళ ఉద్యోగాలు పోకపోయినా, ముందు ముందు ఏం జరుగుతుందో అనే భయం వల్ల చాలామంది తమ పెట్టుబడి నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ఐటీ హబ్‌లలో విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలు, ప్రీమియం అపార్ట్మెంట్ల విక్రయాలు మందగించే సూచనలు కనిపిస్తున్నాయి. డిమాండ్ తగ్గితే నిర్మించిన ఇళ్లు అమ్ముడుపోక బిల్డర్లపై వడ్డీల భారం పెరిగి, మొత్తం ప్రాజెక్ట్ వ్యయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
వాణిజ్య రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
కేవలం నివాస గృహాలే కాకుండా, కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా ఏఐ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. ఏఐ వల్ల కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పనిని పూర్తి చేయగలిగితే, వారికి అవసరమయ్యే కార్యాలయ విస్తీర్ణం తగ్గుతుంది. ఇది భారీ ఆఫీసు భవనాల అద్దెలు , డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలోనే, ఏఐ ఎఫిషియన్సీ కూడా ఆఫీసు స్పేస్ అవసరాలను పునర్నిర్వచించబోతోంది.
భవిష్యత్తు గమ్యం ఎటు?
ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, రాబోయే రెండు మూడేళ్లు అత్యంత కీలకం. ఒకవేళ ఏఐ వల్ల ఉద్యోగ కల్పన పెరిగి, కొత్త రకమైన ఉపాధి మార్గాలు పుట్టుకొస్తే మార్కెట్ కోలుకోవచ్చు. కానీ, ఐటీ రంగంలో వేతన పెరుగుదల ఆగిపోవడం లేదా ఉద్యోగాల కోత కొనసాగితే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో భారీ కరెక్షన్ తప్పకపోవచ్చు. ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిని అవలంబిస్తుండటంతో మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు తలెత్తే ముప్పు కనిపిస్తోంది.
