ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘స్పిరిట్’ నుంచి ఓ ఆడియో స్టోరీ బయటకు వచ్చింది. ఇందులో విజువల్స్ ఏం లేవు. అన్నీ గొంతులే. ప్రకాష్ రాజ్, ప్రభాస్ ల గొంతులతో ఓ కథ నడిపించాడు సందీప్ రెడ్డి వంగా. నిజంగా ఈ ప్రయోగం అద్భుతంగా పేలింది. నిజంగా వీడియో గ్లింప్స్ విడుదల చేసినా ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో? ఈ విషయంలో వంగా సృజన మెచ్చుకొని తీరాల్సిందే.
అయితే… ఈ ఆడియోలో వినిపించింది ప్రభాస్ గొంతు కాదని, అది ఏఐ ద్వారా సృష్టించిందన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై సందీప్ రెడ్డి వంగా గానీ, స్పిరిట్ టీమ్ గానీ స్పందించలేదు. కాకపోతే… ఈ వార్త నిజం అయ్యే ఛాన్సే ఎక్కువ వుంది. ఎందుకంటే.. ఇటీవల ‘మిరాయ్’ సినిమాకు గానూ ప్రభాస్ తన గొంతు అరువు ఇచ్చారు. వాయిస్ ఓవర్ ద్వారా పాత్రల్ని పరిచయం చేశారు. అప్పుడు కూడా ఏఐ టెక్నాలజీనే వాడారు. ఇప్పుడు కూడా అంతే జరిగి ఉండొచ్చు.
సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల లాంటి అమర స్వరాల్ని మళ్లీ మళ్లీ వినడానికి ఇలాంటి సాంకేతికత ఉపయోగపడుతుంది. మన మధ్య లేని వాళ్ల గొంతుల్ని సజీవంగా కాపాడుకోవడానికి ఇదో మార్గం. ప్రభాస్ అందుబాటులో ఉండే హీరోనే. తన ఇంట్లోనే ఓ డబ్బింగ్ స్టూడియో వుంది. అలాంటప్పుడు ఏఐ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఏఐ వల్ల సమయం ఆదా అవుతుంది. పని తగ్గుతుంది. కానీ వర్జినాలిటీ పోతుంది. ఏఐ మాయలో పడిపోతే, ఏది అసలో… ఏది నకలో తెలుసుకోలేని అయోమయంలో పడిపోవాల్సి ఉంటుంది. ఆ తరవాత అసలు గొంతులోని మాధుర్యం కూడా అక్కర్లేనంత దీన అవస్థలోకి వెళ్లిపోయే ప్రమాదం వుంది. ఏఐని వాడుకోవొచ్చు కానీ… మరీ ఇంతలా కాదేమో?