తమిళనాడు రాజకీయాల్లో పార్టీల కన్నా.. వ్యక్తుల ప్రాబల్యమే ఎక్కువ. కరుణానిధి, జయలలితలు అలా తలపడ్డారు. అయితే జయలలిత తర్వాత మరో నాయుకుడు అన్నాడీఎంకేలో చరిష్మా తెచ్చుకోలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఆ పార్టీ ఉనికి ఉండదని అనుకున్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. మంచి ఓటు బ్యాంక్ కొనసాగిస్తోంది. ఇప్పటికీ అదే తరహాలో పోటీ ఇస్తోంది. ఇప్పటికీ విజయ్ కన్నా మంచి ఓటు బ్యాంక్ ఉందని అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా బలంగా నిలబడటం వెనుక లోతైన రాజకీయ కారణాలున్నాయి.
క్యాడర్ బేస్డ్ పార్టీ – సంస్థాగత బలం
అన్నాడీఎంకే కేవలం ఒక వ్యక్తి చరిష్మాపైనే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ పై ఆధారపడి నడిచే పార్టీ. ఎంజీఆర్ కాలం నుండి ఈ పార్టీకి గ్రామ గ్రామాన బలమైన ఓటు బ్యాంకు ఉంది. జయలలిత వంటి ఐకానిక్ నాయకురాలు లేకపోయినా, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో పార్టీ యంత్రాంగం చెక్కుచెదరకుండా ఉంది. బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నెట్వర్క్ ఏమాత్రం దెబ్బతినకపోవడం ఈ పార్టీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.
ప్రతి నియోజకవర్గంలో 50వేల ఓట్ల స్థిరమైన ఓటు బ్యాంక్
జయలలిత మరణం తర్వాత పార్టీ చీలిపోతుందని, ఉనికి కోల్పోతుందని భావించినప్పటికీ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గణనీయమైన ఫలితాలను సాధించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 43,000 నుండి 60,000 వరకు అన్నాడీఎంకేకు స్థిరమైన ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దాదాపు 15-20 శాతం ఓట్లు చీల్చవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, అది ఎక్కువగా యువత లేదా మొదటిసారి ఓటు వేసే వారి నుండి ఉండవచ్చని, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
పళనీస్వామి అంత తీసి పడేయాల్సిన నాయకుడు కాదు !
గత నాలుగేళ్లుగా అధికార డీఎంకే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్తంగా నిరంతర ఆందోళనలు నిర్వహిస్తోంది. ప్రజల పక్షాన నిలబడటం ద్వారా తామే అసలైన ప్రతిపక్షం అనే ముద్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈపీఎస్ సఫలమయ్యారు. అంతేకాకుండా, నీట్ రిజర్వేషన్ వంటి తమ హయాంలోని నిర్ణయాలను ప్రజలకు గుర్తు చేస్తూ సుపరిపాలన రికార్డును ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది. తమిళనాడులో మ్యాజిక్ నెంబర్ సాధించాలంటే పొత్తులు కీలకం. అన్నాడీఎంకే తన పాత మిత్రపక్షాలను కలుపుకుని ఒక మెగా అలయన్స్ దిశగా అడుగులు వేస్తోంది. విజయ్ ఎంట్రీ వల్ల ఓట్ల చీలిక జరిగినప్పటికీ, డీఎంకే వ్యతిరేక ఓట్లు తమ కూటమికే వస్తాయని, పటిష్టమైన పునాది ఉన్న తమ పార్టీని కొత్తగా వచ్చిన పార్టీలు వెనక్కి నెట్టడం అంత సులభం కాదని అన్నాడీఎంకే శ్రేణులు భావిస్తున్నాయి.
