‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో తనకంటూ ఓ బ్రాండ్ వేసిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో అజయ్ పేరు మార్మోగింది. అయితే ఆ తరవాత తీసిన మహా సముద్రం డిజాస్టర్ గా నిలిచింది. తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో తీసిన `మంగళవారం` మంచి విజయాన్ని అందుకొని… మళ్లీ అజయ్ భూపతిపై నమ్మకాలు పెరిగేలా చేసింది. ఇప్పుడుఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయకృష్ణ డెబ్యూ ఫిల్మ్ చేస్తున్నారు అజయ్ భూపతి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అక్టోబరు 15 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తిరుపతి సమీపంలోని ఓ గ్రామం ఇది. ఈ ఊరి చుట్టూ తిరిగే ప్రేమకథ. ఇందులో యాక్షన్ కి సైతం పెద్ద పీట వేశారు. కథానాయికగా రవీనా ఠాండన్ కుమార్తె రాషాని కథానాయికగా ఫిక్స్ చేశారు. ఇటీవల హీరో – హీరోయిన్ల పై ఓ ఫొటో షూట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసం ఓ సీనియర్ నటుడ్ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ నటుడు గనుక ఓకే అంటే… ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం.