తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ పార్టీది ఒక ప్రత్యేక ముద్ర. అధికార పార్టీలతో తెరవెనుక వ్యూహాత్మక సంబంధాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యల ప్రస్తావన వస్తే ఓవైసీ సోదరులు ఎవరినీ విడిచిపెట్టరు. ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారంటే, అధికార పక్షం బెంచీల్లో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంటుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం, మైనారిటీల హక్కుల కోసమే కాదు..రాష్ట్ర అంశాలపై నిర్మోహమాటంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. వారి విమర్శలు ప్రజాస్వామ్యయుతమైన పోరాటానికి నిదర్శనంగా నిలుస్తాయి.
బీఆర్ఎస్ హయాంలోనూ అక్బరుద్దీన్ అసెంబ్లీలో దూకుడే !
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, సభలో అక్బరుద్దీన్ తన గళాన్ని ఎప్పుడూ తగ్గించలేదు. కేటీఆర్ ను సైతం ఆయన నేరుగా నిలదీసిన సందర్భాలు అనేకం. ఒక దశలో పాతబస్తీకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చేసిన సవాల్, ఆ పార్టీకి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర అస్తిత్వాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వంలో నేరుగా భాగస్వామ్యం లేకపోయినా, ఒక బలమైన ఒత్తిడి శక్తిగా తమను ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉంటారు.
రేవంత్ ప్రభుత్వంపైనా అదే తరహా విమర్శలు
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా మజ్లిస్ తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తోంది. మూసీ ప్రక్షాళన వంటి కీలక విషయాల్లో బాధితుల పక్షాన నిలబడటమే కాకుండా, హామీల అమలులో జాప్యాన్ని ఎండగడుతున్నారు. అధికారంలో ఎవరైనా ఉండనివ్వండి.. మా ప్రాధాన్యత మా ప్రజలే అనే స్పష్టమైన సందేశాన్ని వారు ప్రతి సెషన్లోనూ వినిపిస్తుంటారు. సీనియర్ శాసనసభ్యుడిగా అక్బరుద్దీన్ ఓవైసీకి ఉన్న అనుభవం, సభా నిబంధనలపై పట్టు ఆయనను ఒక శక్తివంతమైన ప్రతిపక్ష గొంతుకగా నిలబెట్టాయి.
తెలంగాణ అసెంబ్లీలో విపక్ష బాధ్యత అక్బరుద్దీన్‌దే !
మజ్లిస్ రాజకీయాల్లో ఒక పార్శ్వం వ్యూహాత్మక మైత్రి అయితే, రెండో పార్శ్వం పార్లమెంటరీ పోరాటం. నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార పక్షంతో కలిసి నడుస్తూనే, సభలో మాత్రం ప్రజా సమస్యలపై నిలదీయడం అనేది వారికే చెల్లుతుంది. అక్బరుద్దీన్ చేసే ప్రసంగాలు కేవలం భావోద్వేగపూరితంగానే కాకుండా, గణాంకాలు , లాజిక్‌తో కూడి ఉంటాయి. ఇది ప్రత్యర్థి పార్టీలను సైతం ఆలోచనలో పడేస్తుంది. అధికార పక్షానికి మిత్రుడిగా ఉంటూనే, తప్పులను ఎత్తిచూపే పాత్రను పోషించడం ద్వారా తమ ఉనికిని, తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో వారు విజయం సాధిస్తున్నారని అనుకోవచ్చు.
