బాలయ్య అఖండ 2 వాయిదాతో ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీసు సందడి లేకుండా పోయింది. బాలయ్య సినిమా కావడంతో మరో సినిమా బరిలోకి దిగలేదు. శర్వా బైకర్ కొన్ని కారణాలతో ముందే వాయిదా పడింది. అన్ని అనుకున్నట్లు జరిగుంటే అఖండ 2 సందడి నిన్న ప్రిమియర్స్ నుంచే షురూ అయ్యేది. కానీ అనుకోని పరిస్థితుల వలన అఖండ వాయిదా పడింది.
అయితే ఈ వాయిదా రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ కి కలిసొచ్చింది. అన్నిచోట్ల కాకపోయినా నైజాంలో కొన్ని ఏరియాలతో పాటు మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ ‘ధురంధర్’ వైపు ఓ లుక్ వేశారు. రణ్వీర్ సింగ్ కి ఎన్నడూ లేని బుకింగ్స్ కనిపించాయి. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఉరి లాంటి సంచలనమైన సినిమా తీసిన ఆదిత్య ధర్ దర్శకుడు. టీజర్ ట్రైలర్ లో సందీప్ రెడ్డి వంగా స్టయిల్ మేకింగ్ కనిపించింది. యాక్షన్ ని ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూశారు.
సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. యాక్షన్ ని బాగా డీల్ చేశారు కానీ కథ, కోర్ ఎమోషన్ సరిగ్గా పండలేదు. పైగా ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెట్టే నిడివి. ఒక వెబ్ సిరిస్ చూస్తున్న ఫీలింగ్ కలిగించారు. దీంతోపాటు పార్ట్ 2 కార్డ్ వేసి కథని అసంపూర్ణంగా ముగించడం ఆడియన్స్ కి రుచించలేదు. కాకపోతే ఈమధ్య కాలంలో రణ్వీర్ సినిమాలు అస్సలు వర్క్ కావడం లేదు. ఆయన గత సినిమాలతో పోల్చుకుంటే డీసెంట్ అనిపించుకున్న సినిమానే ఇది. పైగా అఖండ వాయిదా కూడా ప్లస్ అయ్యింది. వీకెండ్ ఏదో ఒక సినిమా చూసేద్దాం అనుకొన్నవాళ్ల వల్ల కాస్త ప్లస్ అయ్యింది. తెలుగులో అయితే రెండు వారాల క్రితం విడుదలైన `రాజు వెడ్స్ రాంబాయి`కి ఈవారం కూడా కాస్తో కూస్తో వసూళ్లు కనిపిస్తున్నాయి.