akhanda 2 telugu movie review
Telugu360 Rating: 2.75/5
‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే ఓ ఫేమస్ డైలాగ్ వుంది..
ఆ డైలాగ్.. బాలయ్య – బోయపాటి కాంబోకి కూడా వర్తిస్తుంది.
బాలయ్య, బోయపాటి.. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు ఎందుకు హిట్టయ్యాయంటే, వీరిద్దరూ కలిసి ఏం చేసినా చూడబుద్దేస్తుంది. వీళ్లకు మాత్రమే సాధ్యమయ్యే మ్యాజిక్ అది. ఆ ఫీట్లు, ఫైట్లు మరెవరు చేసినా లాజిక్కులు వెదుకుతాం. ‘అలా ఎలా’ అని క్వశ్చినింగులు చేస్తాం. కానీ బాలయ్య – బోయపాటి సినిమాల్లో మాత్రం లాజిక్కులు, సైన్స్ సూత్రాలు ఏమాత్రం పని చేయవు. తెరపై ఏదో ఇంద్రజాలం జరుపుతున్నట్టు కళ్లప్పగించి చూడడం మినహా.. సీటులో కూర్చోవాల్సిన మాస్ ప్రేక్షకుడు లేచి, విజిల్ వేయడం మినహా… మరేం చేయలేం. సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లో అదే జరిగింది. ఇవేమీ క్రిటిక్స్ ని అలరించిన సినిమాలు కాకపోవొచ్చు. కానీ మాస్ ప్రేక్షకుల, ముఖ్యంగా బాలయ్య అభిమానుల మనసుల్ని గెలుచుకొన్నాయి. అందుకే అవన్నీ విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయాయి. ఇప్పుడు అఖండ 2 కూడా ఆ స్థానంలో తిష్ట వేసుకొని కూర్చోవడానికి రెడీగా వుంది. విడుదలకు ముందు ఎన్నో అంచనాల్ని, దానితో పాటు అవాంతరాల్నీ మోసుకొచ్చిన సినిమా ఇది. లేటు అవుతున్న కొద్దీ క్రేజ్ పెరుగుతూపోయిన సినిమా ఇది. మరి.. తెరపై బాలయ్య చేసిన శివ తాండవం ఎలాంటిది? బోయపాటి లాజిక్కులకు అందని మ్యాజిక్ ఎలా అనిపించింది..?
భారతదేశాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని శత్రుదేశమైన చైనా భావిస్తుంటుంది. అందుకోసం ఓ కుట్రకు ప్రణాళిక రచిస్తుంది. దేశమంతా అట్టహాసంగా జరుపుకొనే పండగ మహాకుంభమేళాని అందుకు వేదికగా ఎంచుకొంటుంది. గంగానదిలో ఓ వైరస్ వదిలి.. వేలాదిమంది ప్రాణాల్ని హరించి, దేవుడిపైనే నమ్మకం లేకుండా చేసి, సనాతన ధర్మంపై భారతీయులు పెంచుకొన్న నమ్మకాల గోడల్ని బద్దలు కొట్టాలని భావిస్తుంది. వైరస్‌ని అడ్డుకోవడానికి జనని (హర్షాలీ మల్హోత్రా) బృందం వాక్సిన్ని కనుకొంటుంది. వాక్సిన్ని అడ్డుకోవడానికి శత్రువులంతా ఏకమై జననిని వెంబడిస్తుంటారు. ఆ సమయంలో అఖండ (బాలకృష్ణ) రంగ ప్రవేశం చేస్తాడు. జననిని, తనతో పాటు దేశాన్ని శత్రువుల బారీ నుంచి ఎలా రక్షించాడు? సనాతన ధర్మం గొప్పదనం ఈ దేశానికీ, ప్రజలకు ఎలా చాటి చెప్పాడు… అనేదే మిగిలిన కథ.
ఓ సినిమా ఎందుకు చూడాలి? ఎవరి కోసం చూడాలి? అనేది ప్రేక్షకులకు బాగా తెలుసు. బాలయ్య – బోయపాటి కాంబో సినిమా విషయంలోనూ వాళ్లకు పిచ్చ క్లారిటీ ఉంటుంది. కథ కోసమో, లాజిక్కుల కోసమో, ట్విస్టుల కోసమో, విజువల్ గ్రాండియర్ కోసమో బోయపాటి సినిమాలకు వెళ్లరు. వాళ్లకు కావాల్సింది హైస్. మాస్ మూమెంట్స్. అవన్నీ పుష్కలంగా అందించే ప్రయత్నం చేశాడు బోయపాటి. సీన్ నెంబర్ వన్ నుంచి.. చివరి వరకూ సినిమా అంతా ఒకటే టెంపోలో సాగిపోతుంటుంది. అఖండ వచ్చినప్పుడల్లా స్క్రీన్లు దద్దరిల్లుతాయి.
అఖండ 1లో ఏం జరిగిందో చూచాయిగా చెబుతూ… అఖండ 2ని మొదలెట్టాడు బోయపాటి. అఖండ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? తన యాగం ఎందుకోసం అని చెబుతూ, ఆ దేశానికి శత్రువుల నుంచి ఓ భయంకరమైన ఆపద రాబోతోందన్న విషయాన్ని హింట్ ఇస్తూ… కథలోకి లాక్కెళ్లాడు. ఎం.ఎల్.ఏ బాల మురళి కృష్ణ (బాలకృష్ణ) ఇంట్రడక్షన్ సీన్‌తోనే ఫ్యాన్స్ ఖుషీ అయిపోతారు. నరసింహావతారాన్ని కథగా చెబుతూ, బాలయ్యని ఎంటర్ చేయడం బాగుంది. విజువల్ గా లుక్ మారిపోయింది. తొలి ఫైట్ తరవాత… బాలయ్య కన్నడ, తమిళ, హిందీ భాషల్లో చెప్పిన డైలాగులు ఈ సినిమాకు పూర్తి స్థాయి పాన్ ఇండియా అప్పీలుని తెచ్చిపెట్టాయి. బాలయ్య ఏ భాషలో అయినా డైలాగ్ ఇరగదీస్తాడన్న విషయాన్ని మరోసారి ఈ సీన్ నిరూపించింది. ఇది పూర్తిగా బోయ మార్క్ ఫైట్ అనుకోవొచ్చు. ఆ తరవాత ఓ మాస్ సాంగ్ తో.. బాలయ్య ఎనర్జీని మరో స్థాయిలో చూపించాడు బోయపాటి. `అఖండ`లోని షర్టు మార్చుకొనే సిగ్నేచర్ స్టెప్.. ఈసారి కూడా కంటిన్యూ చేయించాడు. కొన్ని కొన్ని మూమెంట్స్ రిపీట్ మోడ్‌లో చూస్తే బోర్ కొడతాయి. కానీ.. అక్కడున్నది బాలయ్య కదా. ఈసారి కిక్ డబుల్ అయ్యింది. మహా కుంభమేళాలో జరిగే విధ్వంసం వరకూ కొంత బోరింగ్ ఎపిసోడ్స్ నడుస్తుంటాయి. మళ్లీ కుంభమేళా సీన్‌తో… కథలో కదలిక వస్తుంది. అఖండ రాకతో… ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అఖండ రూపంలో బాలయ్య శివ తాండవం ఆడేశాడు. దిష్టి తీసే సీన్ అయితే పీక్స్ లో ఉంటుంది. ఆ సీన్‌కి థియేటర్‌కే పూనకం రావడం గ్యారెంటీ. ప్రేక్షకులకు కిక్ ఇచ్చే ఎనర్జిటిక్ మూమెంట్ దగ్గరే ఇంట్రవెల్ కార్డ్ వేశాడు బోయపాటి.
వైరస్ – వాక్సిన్ చుట్టూ నడిచే టెన్షన్, డ్రామా ఎందుకో రక్తి కట్టలేదు. ఈ విభాగంలో బోయపాటి పెద్దగా దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. వైరస్ – వాక్సిన్ అనగానే కరోనా నాటి రోజులు గుర్తొస్తాయి. ఆ పాయింట్ ని బోయపాటి ఇలా వాడుకొన్నాడేమో అనిపిస్తుంది. వాక్సిన్ తయారు చేసే విధానాన్ని బోయపాటి స్టడీ చేయలేదు. దాంతో అవన్నీ పైపై వ్యవహారాల్లానే అనిపిస్తాయి. ఆది పినిశెట్టి పోషించిన నేత్ర పాత్ర సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తుంది. దుష్ట శక్తులన్నీ ఆవాహన చేసుకొన్న పవర్ఫుల్ పాత్ర అది. చూడ్డానికి, రాసుకోవడానికి నేత్ర అనేది శక్తిమంతమైన పాత్రే. కానీ.. అఖండ ముందు అది కూడా నిలవలేకపోయింది. శివుడి అవతారమే భూమ్మీద శత్రు సంహారం చేస్తుంటే, నేత్ర లాంటి పాత్రలు ఏం ఆనతాయి?
దేవుడు అనే పాయింట్ ని బోయపాటి ఈ సినిమాలో చాలాసార్లు వాడుకొన్నాడు. కొన్నిసార్లు సరైన సమయంలో.. ఇంకొన్ని సార్లు.. తనకు ఇష్టం వచ్చినప్పుడు. `అఖండ`లో దైవానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉంటాయి. కానీ వాటిని అవసరమైన మేరకే వాడాడు. ఈసారి మాత్రం ఆ వాడకం ఎక్కువైంది. నరసింహస్వామి, హనుమంతుడు, శివుడు.. ఇలా దేవుళ్లంతా పూనేస్తుంటారు. శివుడ్ని సైతం భూమ్మీదకు దింపేశాడు. సనాతన ధర్మానికి సంబంధించిన చాలా డైలాగులు సహేతుకంగా అనిపిస్తాయి. దేవుడు ఉన్నాడా, లేడా.. ఉంటే ఎందుకు రాడు? అనే అంశం మీద అఖండ ఇచ్చిన సుదీర్ఘమైన వివరణ సనాతన ధర్మాన్ని ఇష్టపడేవాళ్లకు, ఆచరించేవాళ్లకు, గౌరవించేవాళ్లకు నచ్చుతుంది. అయితే కొన్నిసార్లు దైవానికి సంబంధించిన విషయాలు అంత ఆర్గానిక్ గా కుదర్లేదు అనిపిస్తుంది. చివర్లో… అఖండ ఆడిన రుద్రతాండవం, అఖండ భారతదేశం గురించీ, ఇక్కడి వేదాల గురించీ, నదుల గొప్పదనం గురించి చెప్పిన సంభాషణలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి.
ఇది బాలయ్య వన్ మాన్ షో. బాలమురళి కృష్ణ ఓ ఫైట్, పాట, ఇంకొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమయ్యాడు. మిగిలినదంతా అఖండ హవానే. అఖండ పాత్రలో బాలయ్య కనిపించిన ప్రతీసారీ థియేటర్లు ఊగిపోతాయి. ఆ పాత్రని బాలయ్య ఆకళింపు చేసుకొన్న విధానం అలాంటిది. బడా హీరోలు వయసుకి తగ్గ పాత్రలు చేస్తున్నప్పుడు ఇలానే హుందాగా ఉంటుందేమో? బాలయ్య తరవాత ఎక్కువ స్క్రీన్ టైమ్ తీసుకొన్న క్యారెక్టర్ జనని. ఆ పాత్రలో భజరంగీ భాయ్ జాన్ ఫేమ్ హర్షాలీ కనిపించింది. ఆ అమ్మాయికి తెలుగు రాదు. అందుకే హావభావాల విషయంలో తేలిపోయింది. సంయుక్త పాత్ర ని హీరోయిన్గా చూడలేం. ఉన్నంతలో మెరిసేందుకు ప్రయత్నించింది. ఆది పినిశెట్టి గెటప్ బాగుంది. కాకపోతే.. అఖండ ముందు తన కష్టం కూడా తేలిపోయింది.
తమన్ ఈ చిత్రానికి మరో హీరో. సౌండింగ్ తో ఓ ఆట ఆడుకొన్నాడు. అఖండ ఎప్పుడొచ్చినా.. పూనకం వచ్చినట్టు బీజిఎమ్స్ ఇచ్చేశాడు. పాటలకు స్కోప్ తక్కువ. ఉన్నదంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి వాడుకొన్నాడు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ప్రతీ సీన్లోనూ వందలాదిమంది జూనియర్లు కనిపిస్తుంటారు. కొన్నిసార్లు అతడు సినిమాలోని ‘అంతమంది ఎందుకురా బుజ్జీ..’ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. అది కూడా బోయపాటి మార్క్ అని సర్దుకుపోవాలి. అఖండ పాత్ర కోసం రాసుకొన్న ప్రతీ డైలాగూ బాగుంది. బోయపాటి శ్రీను బాలయ్యపై తనకున్న అభిమానం మరోసారి చాటుకొన్నాడు. బాలయ్యని చాలా స్టైలీష్ గా, పవర్ ఫుల్ గా చూపించాడు. రైటింగ్ విషయంలో తాను ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికినప్పుడు పూర్తి స్థాయిలో వాడుకోవాలంటే, రచయితగానూ మెరుగుపడాలి. నిర్మాతలు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు పెట్టారు. అందుకే అంత గ్రాండియర్ కనిపించింది.
మొత్తంగా ఇది బాలయ్య సినిమా. బోయపాటి మార్క్ సినిమా. లాజిక్కులు వదిలేసి.. కేవలం మ్యాజిక్ మాత్రమే చూడాల్సిన సినిమా. బాలయ్య వచ్చినప్పుడల్లా లేస్తున్నామా, విజిల్ వేస్తున్నామా, ఆ మానియాలో కూరుకుపోతున్నామా.. అంతే. దానికే టికెట్ రేటు గిట్టుబాటు అయిపోయినప్పుడు ఇక మిగిలినవన్నీ దండగే. అఖండగా బాలయ్య ఆడిన శివతాండవం కోసం బాలయ్య ఫ్యాన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
akhanda 2 telugu movie review
Telugu360 Rating: 2.75/5
– అన్వర్