అఖండ‌ రివ్యూ – మాస్ జాతర

Akhanda telugu review

Telugu360 Rating : 3/5

ఓ మాస్ హీరోని ఎలా చూపించాలో బోయ‌పాటి శ్రీ‌నుకి బాగా తెలుసు. ఫ్యాన్స్ కి ఏం కావాలో, ఎలా కావాలో.. ఆ లెక్క‌ల‌న్నీ బాగా బ‌ట్టీ ప‌ట్టేశాడు. ఎలివేష‌న్ల ప‌రంగా అయితే.. బోయ‌పాటిని కొట్టేవాడే లేడు. అయితే.. ఇవ‌న్నీ ఎంతున్నా.. ఎమోష‌న్‌ని ప‌ట్టుకోవ‌డంలో కూడా దృష్టి సారించాడు. అలా… మాస్ లెక్క‌లు, ఎమోష‌న్‌.. ఇవి రెండూ వ‌ర్క‌వుట్ అయిన ప్ర‌తీసారీ.. బోయ‌పాటి హిట్టు కొట్టేశాడు. త‌ను త‌ప్పిన సినిమాల్లో ఎమోష‌న్ అయినా త‌క్కువ అయ్యేది. లేదంటే యాక్ష‌న్ అయినా ఎక్కువ అయ్యేది. త‌న చివ‌రి సినిమా `విన‌య విధేయ రామా` ఫెయిల్ అవ్వ‌డానికి కార‌ణం అదే. ఈసారి… త‌నకు బాగా అచ్చొచ్చిన బాల‌కృష్ణ‌ని న‌మ్ముకున్నాడు. అటు.. బాల‌య్య కూడా అభిమానుల‌కు త‌న‌దైన సినిమా ఒక‌టి బాకీ ప‌డిపోయాడు. అందుకే వీరిద్ద‌రి కాంబోలో `అఖండ‌` సెట్ అయ్యింది. ఈ సినిమాలో బోయ‌పాటి మ‌ళ్లీ ఎమోష‌న్‌నీ, ఎలివేష‌న్‌నీ మ్యాచ్ చేయ‌గ‌లిగాడా? త‌న‌కు బాగా ట్యూన్ అయిపోయిన బోయ‌పాటికి బాల‌య్య హ్యాట్రిక్ ఇవ్వ‌గ‌లిగాడా?

అనంత‌ర‌పురంలో… ముర‌ళీ కృష్ణ (బాల‌కృష్ణ‌) ఓ రైతు. ఫ్యాక్ష‌నిజాన్ని అరిక‌ట్టి, అంద‌రి చేత వ్య‌వ‌సాయం చేయిస్తాడు. త‌న ప్రాంత ప్ర‌జ‌ల్ని స‌న్మార్గంలో న‌డిపిస్తూ ఉంటాడు. ఆసుప‌త్రులు క‌ట్టించి.. పేద ప్ర‌జ‌ల‌కు అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌తో వైద్యం అందిస్తుంటాడు. ఆ జిల్లాకి కొత్త క‌లెక్ట‌ర్ గా శ‌ర‌ణ్య (ప్ర‌గ్యా జైస్వాల్‌) దిగుతుంది. తొలి సీన్‌లో ముర‌ళీ కృష్ణ‌ని అపార్థం చేసుకుని, ఆ త‌ర‌వాత‌.. త‌న గుణ‌గ‌ణాలు చూసి ఇష్ట‌ప‌డుతుంది. ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకుంటారు. మ‌రోవైపు అనంతపురంలో వ‌ర‌ద‌రాజులు (శ్రీ‌కాంత్) మైనింగ్ పేరుతో యురేనియం నిక్షేపాల‌ను వెలికి తీస్తుంటాడు. యురేనియం త్ర‌వ్వ‌కాల వ‌ల్ల రేడియేష‌న్ పెరిగి, ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లొస్తుంటాయి. పుట్టిన బిడ్డ‌.. పుట్టిన‌ట్టే క‌నుమూస్తుంటుంది. ఈ అరాచ‌కాన్ని అడ్డుకోవ‌డానికి ముర‌ళీకృష్ణ ప్ర‌య‌త్నిస్తే… ఊర్లో వాళ్ల‌ని దారుణంగా చంపి, ఆ నేరం ముర‌ళీకృష్ఱ‌పై వేసి, అరెస్టు చేయిస్తాడు వ‌ర‌ద‌రాజులు. ముర‌ళీకృష్ణ కుటుంబాన్నీ అంతం చేయాల‌నుకుంటాడు. ఈ ద‌శ‌లో..అఖండ (బాల‌కృష్ణ‌) రంగ ప్ర‌వేశం చేస్తాడు. ముర‌ళీకృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటాడు. అస‌లు ఈ అఖండ ఎవ‌రు? ముర‌ళీకృష్ణ‌తో త‌న‌కేంటి సంబంధం? వ‌ర‌ద‌రాజుల వెనుక ఉన్న ఓ అదృశ్య శ‌క్తి ఎవ‌రు? ఇదంతా మిగిలిన క‌థ‌.

బోయ‌పాటి శ్రీ‌ను ఈసారి కూడా క‌థ‌పై దృష్టి పెట్ట‌లేదు. త‌ను న‌మ్ముకున్న‌ది ఎలివేష‌న్లు, యాక్ష‌న్ ఎపిసోడ్లు. మాస్ హీరోల్ని బాగా ఎలివేట్ చేస్తాడ‌ని పేరు తెచ్చుకున్న బోయ‌పాటి, పూర్తిగా ఈసారి దానిపైనే ఫోక‌స్ చేశాడు. అందుకే తెర నిండా రౌడీలు, విల‌న్లు, క‌త్తులు, ఫైట్లు, ర‌క్త‌పాతాలు. ముర‌ళీ కృష్ణ ఇంట్ర‌డ‌క్ష‌నే.. ఓ ఇంట్ర‌వెల్ బ్యాంగ్ లా ఉంటుంది. రంకెలేస్తున్న ఎద్దుల మ‌ధ్య నుంచి బాల‌య్య న‌డ‌చుకుంటూ రావ‌డం, వార్నింగులు ఇవ్వ‌డం, ఎత్తిప‌డేయ‌డం.. ఇవ‌న్నీ అభిమానుల‌కు న‌చ్చుతాయి. ఆ వెంట‌నే.. హీరోయిన్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌. క‌ళ్లు సీన్‌లో `నాక‌డం` డైలాగు ఎబ్బెట్టుగా అనిపించినా – ఆ వెంట‌నే `జై బాల‌య్య‌` పాట‌.. ఫ్యాన్స్‌కి ఫీస్ట్ లా ఉంటుంది. ఆ పాట‌లో బాల‌య్య వేసిన స్టెప్పులు, మార్చిన కాస్ట్యూమ్స్‌… ఓ రంగుల పండ‌గ‌లా అనిపిస్తుంది. శ్రీ‌కాంత్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌, ఆకులో త‌ల‌కాయ పెట్ట‌డం ఓవ‌ర్‌గా అనిపించినా – త‌న‌ని అలా చూడ‌డం కొత్త కాబ‌ట్టి, వ‌ర్క‌వుట్ అవుతుంది. ఆ త‌ర‌వాత నుంచి అడుక్కో ఫైటు, నిమిషానికో ఎలివేష‌న్ అన్న‌ట్టు సాగుతుంది సినిమా. ఇంట్ర‌వెల్ ముందైతే.. క‌నీసం 20 నిమిషాలు యాక్ష‌న్ ఎపిసోడ్ కే కేటాయించారు. అక్క‌డే.. అఖండ ఎంట్రీ కూడా ఉంటుంది. ఆ ఫైట్‌, అందులోని బాల‌య్య ఎలివేష‌న్లు ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తాయి. దాంతో.. బాల‌య్య అభిమానులు కాస్త సంతృప్తిక‌రంగానే థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు.

నిజానికి ఈ సినిమాలో బాల‌య్య రెండు గెట‌ప్పుల్లో క‌నిపిస్తాడు.. అనే విష‌యాన్ని చిత్ర‌బృందం దాచితే బాగుండేది. ఎందుకంటే… ముర‌ళీకృష్ణ కుటుంబం ఆప‌ద‌లో ప‌డిన‌ప్పుడు.. `ఇక్కడ అఖండ వ‌చ్చేస్తాడులే` అనే ధీమా, రెండో పాత్ర కోసం వెయిటింగులో ప‌డిపోయిన ప్రేక్ష‌కుడు ఆ ఎమోష‌న్‌నీ, క‌థ‌నీ మిస్ అయిపోతాడు. రెండో పాత్ర ఎక్క‌డైతే వ‌స్తుంద‌ని ప్రేక్ష‌కుడు భావిస్తాడో, స‌రిగ్గా అక్క‌డే అఖండ ఎంట్రీ ఇస్తాడు. అఖండ ఎంట్రీ ఎప్పుడైతే వ‌చ్చిందో, అక్క‌డి నుంచి ముర‌ళీ కృష్ణ పాత్ర మాయం అయిపోతుంది. మ‌ళ్లీ తేలేది క్లైమాక్స్ ఫైట్ లోనే. దాదాపు స‌గం సినిమా అఖండ పాత్రే న‌డిపిస్తుంది. గుళ్ల గురించి, హిందూ ధ‌ర్మం గురించీ ఇచ్చిన లెక్చ‌ర్లు మిన‌హాయిస్తే.. సెకండాఫ్ కూడా అడుగుకొక ఫైట్‌లా మారిపోయింది. సినిమా అంటే ఎమోష‌న్లు త‌ప్ప ఎలివేష‌న్లు కావు. ఎంత మాస్ హీరో సినిమా అయినా.. ఒక‌ట్రెండు సార్లు స్లో మోష‌న్ షాట్లుల ప‌డితే.. ఫ్యాన్స్ చొక్కాలు చించుకుంటారు. అస్తమానూ.. అదే షాట్లు రిపీట్ అయితే సినిమాలో ఇది త‌ప్ప ఇంకేం లేవా అనిపిస్తుంది.

అస‌లే బోయ‌పాటి సినిమాలో హీరో ధీరోధాత్తుడిలా, ఎదురు లేని వాడిగా క‌నిపిస్తాడు. దైవాంస సంభూతుడినే హీరోగా చూపిస్తే.. ఇక బోయ‌పాటికి అడ్డు ఏం ఉంటుంది. హీరోతో ఏమైనా చేయించేయొచ్చు. అఖండ పాత్ర‌తో తాను అనుకున్న‌ద‌ల్లా చేయించేశాడు, చూపించేశాడు బోయ‌పాటి. కాబ‌ట్టి… అస‌లు ఆ పాత్ర చుట్టూ లాజిక్కులు మ‌ర్చిపోతేనే బెట‌రు. ఫ‌స్టాఫ్‌లో.. ఫ్యాన్స్‌కి రంజింప‌చేయ‌డానికి `జై బాల‌య్య‌` పాటైనా ఉంది. సెకండాఫ్ లో అది కూడా లేదు. హీరోయిన్ సైతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవ‌డంతో ఫైట్లు త‌ప్ప‌.. మాస్‌కి కావ‌ల్సిన మ‌రో ఎమోష‌న్ దొర‌క‌దు. అఖండ – ముర‌ళీ కృష్ణ ఇద్ద‌రూ కొట్టుకుంటూ పోవ‌డం త‌ప్ప – ఇంకో యాంగిల్ క‌నిపించ‌దు. తెర‌పై గుంపులు గుంపులుగా న‌టీన‌టులు ఉన్నా – వాళ్లంతా జూనియ‌ర్ ఆర్టిస్టులుగా మారిపోవ‌డం త‌ప్ప‌, ఎవ‌రికీ స‌రైన డైలాగ్ ఉండ‌దు. ముర‌ళీ కృష్ణ ఇంట్లో కెమెరా ప్యాన్ చేస్తే 40 -50మంది ఆర్టిస్టులు ఉంటారు. అందులో తండ్రి క్యారెక్ట‌ర్ కి త‌ప్ప‌, ఇంకెవ్వ‌రికీ డైలాగ్ ఉండదు. కేవ‌లం బొమ్మ‌ల్లా క‌నిపిస్తారంతే.

ముర‌ళీకృష్ణ పాత్ర‌లో బాల‌య్య చాలా అందంగా కనిపించాడు. సాధార‌ణంగా ఫైట్స్‌లో రౌద్రంగా ఉంటారు హీరోలు. కానీ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ లో సైతం బాల‌య్య అందంగానే ఉంటాడు. త‌న కాస్ట్యూమ్స్ కూడా బాగా న‌ప్పాయి. కొత్త‌గానూ ఉన్నాయి. ఇక జై బాల‌య్య పాట‌లో కొత్త త‌ర‌హా స్టెప్పులు వేశాడు. అఖండ‌గా.. బాల‌య్య గెట‌ప్ సూట‌య్యింది. ఇక డైలాగ్ డెలివ‌రీ అంటారా.. అదంతా.. సింహా, లెజెండ్ ల స్థాయిలోనే ఉంది. ఆ సినిమాకీ, ఈ సినిమాకీ ఏమాత్రం మార్పులేదు. చూడూ.. ఒక‌వైపే చూడు.. లాంటి మాడ్యులేష‌నే. ప్ర‌గ్యా జైస్వాల్ గ్లామ‌రెస్ గా క‌నిపించింది. క‌లెక్ట‌ర్‌గా రెండు మూడు స‌న్నివేశాల్లో మెరిసిన త‌ర‌వాత‌.. క‌థ ప్ర‌కారం త‌న‌ని డీ గ్లామ‌ర్ గా చూపించాల్సివ‌చ్చింది. జ‌గ‌ప‌తిబాబు బేస్ వాయిస్ లో మాట్లాడడంతో అస‌లు త‌ను జ‌గ‌ప‌తిబాబేనా అనే అనుమానం వేస్తుంది. శ్రీ‌కాంత్ కి విల‌నిజం కొత్త‌. తాను కూడా ప‌ట్టీప‌ట్టీ న‌టించిన‌ట్టు అనిపిస్తుంది. శ్రీ‌కాంత్ చేయ‌డం వ‌ల్ల ఆ పాత్ర‌కొచ్చిన మైలేజీ అంటూ ఏం లేదు. బాబా గెట‌ప్‌లో క‌నిపించిన న‌టుడెవ‌రో గానీ, త‌న‌ని కూడా వాయిస్ డామినేట్ చేసేసింది. పూర్ణ‌.. ప‌ద్ధ‌తిగా క‌నిపించింది.

త‌మ‌న్ బీజియ‌మ్స్ ఓ ప్ల‌స్ పాయింట్‌. ఎలివేష‌న్లు ఎక్కువ కాబ‌ట్టి.. త‌ను కూడా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది. జై బాల‌య్య‌, బంబం.. పాట‌లు బాగున్నాయి. కెమెరా వ‌ర్క్ చాలా బాగుంది. టెక్నిక‌ల్ గా ఈ సినిమా హై స్టాండ‌ర్డ్ లో ఉంది. ఫైట్ మాస్ట‌ర్ల‌కు ఎక్కువ ప‌ని ప‌డింది. స‌గం సినిమా వాళ్లే తీసిన‌ట్టు లెక్క‌. బోయ‌పాటి ఎప్ప‌టిలానే.. కేవ‌లం మాస్ వైపే ఆలోచించి ఈ సినిమా తీశాడు. కేవ‌లం ఎలివేష‌న్లు మాత్ర‌మే సినిమాని గ‌ట్టెక్కిస్తాయి అనే భ్ర‌మ‌లోంచి తాను బ‌య‌ట‌కు రావాలి.

కుటుంబ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌న్న‌ది ఇప్ప‌టి సినిమా తాప‌త్ర‌యం. అయితే అఖండ‌తో ఆ ప్ర‌యోజ‌నం సిద్ధించ‌క‌పోవ‌చ్చు. ఇందులో ఫ్యామిలీస్‌కి న‌చ్చే ఎలిమెంట్స్ ఏమీ లేక‌పోవ‌డం ఇబ్బంది క‌లిగిస్తుంది. కేవ‌లం ఫ్యాన్స్‌కి మాస్ కి మాత్ర‌మే.. వాళ్ల కోస‌మే ఈ సినిమా తీశానంటే ఓకే. అంత‌కు మించి అఖండ నుంచి ఏం క్రియెటివిటి ఆశించ‌లేం.

అఖండ తొలి సగం మంచి మాస్ ఎలిమెంట్స్ తో , ద్వితీయార్ధం హీరొయిజం తో కూడిన ఫైట్లు గా ఉంటుంది. చాలా కాలంగా భారీ మాస్ సినిమా కోసం ఎదురు చూసే సగటు సినిమా అభిమానులను అకట్టుకునే సినిమా

Telugu360 Rating : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close