ఎట్టకేలకు ‘అఖండ 2’ థియేటర్లలో సందడి చేయబోతోంది. 11న ప్రీమియర్లు.. 12న సినిమా రిలీజ్. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక తెలంగాణలో కౌంటర్లు ఇంకా తెరచుకోలేదు. ఈరోజు సాయింత్రంలోగా బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
మరోవైపు ‘అఖండ 2’ వసూళ్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయన్న విషయంలో టాలీవుడ్ లో గట్టి చర్చే నడుస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. దానికి తగ్గట్టుగానే ప్రతీ ఏరియాలోనూ రికార్డు ధరకు సినిమాని అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.200 కోట్లు సాధించాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ‘అఖండ 2’ బజ్, ఈ కాంబోపై ఉన్న క్రేజ్, ప్రీమియర్ టికెట్ ధరలు ఇవన్నీ చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ సాధించడం పెద్ద కష్టమేం కాదని తెలుస్తూనే ఉంది. కాకపోతే…. తొలి రోజు హిట్ టాక్ చాలా ముఖ్యం.
ఈ సంక్రాంతికి వచ్చిన ‘డాకూ మహారాజ్’ సినిమాకూ హిట్ టాక్ వచ్చింది. పైగా సంక్రాంతి సీజన్. అయితే టోటల్ రన్ లో రూ.120 కోట్లు సాధించింది ఈ సినిమా. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. కాస్ట్ ఫెయిల్యూర్‌గా ఈ సినిమాని విశ్లేషకులు చెబుతుంటారు. కాకపోతే.. అప్పటికి బాలయ్య సినిమాల్లో ఇన్ని వసూళ్లు రావడం అదే ప్రధమం. డాకూతో పోలిస్తే…’అఖండ 2′ పరిస్థితులు చాలా విభిన్నం. బాలయ్య – బోయపాటి అనేది కాంబో పరంగా క్రేజ్. పైగా ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా.
రూ.200 కోట్లు ఈరోజుల్లో మాస్, యాక్షన్ సినిమాలకు పెద్ద కష్టం కాదు. పైగా ‘అఖండ 2’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. తొలిసారి హిందీలోనూ బాలయ్య సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ తరహా జోనర్లకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దొరుకుతుంది. సో… అక్కడ కూడా బాలయ్య యాక్షన్ నచ్చేస్తే రూ.200 కోట్లు ఈజీనే. అయితే ఓవర్సీస్లో, ఇండియాలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో అవతార్ 3 రూపంలో వచ్చే వారం గట్టి పోటీ ఎదురుకాబోతోంది. సెకండ్ వీక్ రన్.. ‘అవతార్ 3’ వల్ల ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఈ లెక్కలన్నీ అఖండ 2 ఎలా దాటుకొని వస్తుందో చూడాలి.
