వేసవి సినిమాల రిలీజ్ డేట్లు కాస్త అటూ ఇటూ అవుతున్నాయి. ముందు అనుకొన్న సమయానికి సినిమాలు రావడం లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? అనే విషయంలో అభిమానులకు కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నిర్మాణ సంస్థలకు ఉంది. అఖిల్ సినిమా ‘లెనిన్’ రిలీజ్ డేట్ కూడా డైలామాలో ఉన్న సంగతి తెలిసిందే. మే1న ఈ సినిమాని విడుదల చేస్తామని అప్పట్లో నిర్మాత నాగవంశీ ప్రకటించారు. అయితే ఆ తరవాత అలికిడి లేదు. ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ అవుతోంది. మరోవైపు ‘లెనిన్’ కి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీ మొదలవ్వలేదు. దాంతో ‘లెనిన్’ వస్తుందా, రాదా? అనే డౌటు ఉంది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. లెనిన్ సినిమా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి, కొత్త రిలీజ్ డేట్ గా జూన్ 26న ఫిక్స్ చేసింది. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అయిన నేపథ్యంలో `లెనిన్` తప్పుకోవడం మంచి నిర్ణయమే.
పైగా ‘లెనిన్’ ని హడావుడిగా విడుదల చేస్తే కుదరదు. అఖిల్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా ఇది. గట్టి పోటీలో విడుదల చేసి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. జూన్ 26 ఓరకంగా సేఫ్ డేట్. అప్పటికి సమ్మర్ సినిమాల హడావుడి తగ్గిపోతుంది. మరోవైపు ఐపీఎల్ గోల కూడా ఉండదు. ప్రచారానికి తగినంత సమయం ఉంది. ఈలోగా రిపేర్లు ఉంటే చేసుకోవొచ్చు. వాయిదా విషయం ముందే ప్రకటించడం వల్ల అభిమానులకు, బయ్యర్లకు ఓ క్లారిటీ వస్తుంది. జూన్ 26 ముందే లాక్ చేయడం వల్ల మిగిలిన సినిమాలేమైనా ఈ డేట్ కి రావాలనుకొంటే మరో డేట్ చూసుకొనే వెసులుబాటు ఉంటుంది. వాయిదా వేయడం తప్పదు అనుకొన్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా ప్రకటించి, క్లారిటీ ఇవ్వడం చాలా అవసరం. నాగవంశీ ఇప్పుడు అదే చేశారు.


