అభిమానులు ప్రేమగా ‘అయ్యగారు..’ అని పిలుచుకొనే అఖిల్ అక్కినేని ఎప్పటి నుంచో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈమధ్యే పెళ్లి కూడా అయ్యింది. పెళ్లయ్యాక ఓ హిట్ పడితే.. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిగత జీవితం కూడా సెటిల్ అయిపోయిన సంతృప్తి కలుగుతుంది. అందుకే తన ఆశలన్నీ `లెనిన్` పైనే పెట్టుకొన్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శ్రీలీల కథానాయిక. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో యాక్షన్ కి పెద్ద పీట వేశారు. కథేమిటో చూచాయిగా కూడా చెప్పలేదు.
అయితే ఇదో పరువు హత్య నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. మరో లేయర్లో ఆలయానికి సంబంధించిన కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు విషయాలూ ఎలా మిక్స్ చేశారన్నది ఆసక్తికరం. పరువు హత్య నేపథ్యంలో ఇది వరకు చాలా సినిమాలొచ్చినా, వాటి కంటే భిన్నంగా ఈ సినిమాని తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు దర్శకుడు. ‘లెనిన్’ అనే టైటిల్ సైతం ఆసక్తిని కలిగిస్తోంది. అఖిల్ లుక్, గెటప్ కొత్తగా కనిపిస్తున్నాయి. రాయలసీమ స్లాంగ్ కూడా బాగానే పట్టేశాడు. నాగార్జున, సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పాటలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేసే అవకాశం ఉంది.