యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చారు. యాదవ సంఘాల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు. వచ్చారు కాబట్టి ఆయన రాజకీయంగా కలసి పని చేసేవారిని కలవాలనుకోవడం సహజమే. ఆయన ఇండియా కూటమిలో కీలక నేత. ఆయన వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఆతిధ్యానికి పిలిచారు. యాదవ సంఘాల సమావేశం తర్వాత అఖిలేష్ రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఆతిథ్యం స్వీకరించారు. ఆ తర్వాత కేటీఆర్ తో సమావేశానికి వెళ్లారు.
కేటీఆర్ ఇండియా కూటమిలో లేరు. కానీ అఖిలేష్ తో మాత్రం సమావేశానికి ఆసక్తి చూపారు. స్వయంగా పాత పరిచయాలతో ఆయనే అఖిలేష్ ను ఇంటికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అఖిలేష్ కూడా ముందుగా సీఎం రేవంత్ కు ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళ్లారు. కాసేపు రాజకీయాలు మాట్లాడుకున్న తర్వాత అఖిలేష్ వెళ్లిపోయారు. తనకు అఖిలేష్ యాదవ్ స్ఫూర్తి అని కేటీఆర్ చెప్పారు.
అఖిలేష్ యాదవ్ కేటీఆర్ ను మాత్రమే కలిసి ఉంటే చాలా రకాల చర్చలు జరిగి ఉండేవి. అవి బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటాయి. ఇండీ కూటమి నేతలతో సన్నిహితంగా ఉండటం అంటే.. శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తుంది. రేవంత్ తోనూ సమావేశం కావడం వల్ల కర్టసీ మీటింగులని సర్దుకుపోయే అవకాశాలు ఉన్నాయి.