వైసీపీ హయాంలో అలిపిరి పాదాల చెంత నిర్మాణం ప్రారంభమైన ముంతాజ్ హోటల్ అనుమతుల్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అక్కడ ప్రారంభించిన నిర్మాణాల నిలిపివేసి స్థలాన్ని వెనక్కి తీసుకుంది. ముంతాజ్ అనే పేరు ముస్లింలను పోలి ఉందని.. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి వద్ద ఆ పేరుతో హోటల్ నిర్మించడం ఏమిటన్న వివాదాలు వచ్చాయి. వైసీపీ హయాంలో జగన్.. ఇతర ప్రాజెక్టుకు ఆ భూమి కేటాయించినప్పటికీ రద్దు చేసి.. హోటల్ కు ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత భక్తుల మనోభావాలకు తగ్గట్లుగా నిర్ణయం తీసుకుని ఆ హోటల్ అనుమతుల్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఒబెరాయ్ హోటల్స్ సంస్థ అప్పటికే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకుంది. అదే సమయంలో తిరుపతి అభివృద్ధికి, అక్కడి యువతకు ఉపాధి కోసం సెవన్ స్టార్ హోటల్ నిర్మాణం జరిగేలా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై పడింది. అందుకే ప్రభుత్వం అలిపిరిలో కాకుండా..మరో చోట ఇరవై ఎకరాలు కేటాయించింది. అక్కడ కూడా ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఒబెరాయ్ గ్రూప్ కొత్త అనుబంధ సంస్థ స్వర హోటల్స్ లిమిటెడ్ ను ప్రారంభించింది. స్వర హోటల్స్ పేరుతో ఈ నిర్మాణం జరుగుతుంి.
మొత్తం పెట్టుబడి సుమారు రూ. 250 కోట్లు పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి రూరల్లో 20 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అలిపిరి స్థలానికి ప్రత్యామ్నాయంగా కేటాయిస్తున్నందున స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ మినహాయింపులు ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ శ్రీవారి భక్తులకు ప్రీమియం గెస్ట్ హౌస్లా పనిచేస్తుంది ,సుమారు 1,500 ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది ఒబెరాయ్ గ్రూప్ అల్ట్రా-లగ్జరీ విస్తరణలో భాగం. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.
