రష్మిక ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉంది. తను ముట్టుకొన్నదల్లా బంగారమే. పుష్ప, పుష్ప 2, యానిమల్, చావా… ఇలా ఒకదాన్ని మించి మరో విజయం. తాజాగా తన ఖాతాలో ‘కుబేర’ కూడా చేరిపోయింది. కాకపోతే మిగిలిన సినిమాలు వేరు, కుబేర వేరు. ఎందుకంటే ఇది రెగ్యులర్ హీరోయిన్ సినిమా కాదు. తనది అసలు `హీరోయిన్ క్యారెక్టరే` కాదు. జస్ట్.. కథని నడిపించే మరో పాత్ర. ఇలాంటి పాత్రలు చేయడానికి కూడా గట్స్ కావాలి. ఆ సాహసం రష్మిక చేసింది. రష్మిక ఉంటే చాలు, సినిమా హిట్టయిపోతుందన్న సెంటిమెంట్ ని ‘కుబేర’ మరింత బలపరిచింది. రష్మిక లక్.. ‘కుబేర’ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘కుబేర’ సక్సెస్ మీట్ లో చిరు, నాగ్, దేవిశ్రీ ప్రసాద్ రష్మికను ఆకాశానికి ఎత్తేశారు. ‘రష్మిక నా క్రష్’ అంటే ‘నా క్రష్’ అంటూ నాగ్, చిరు ఇద్దరూ పోటీ పడ్డారు. నాగ్ అయితే రష్మికను శ్రీదేవితో పోల్చారు. ఇవన్నీ రష్మికకు గొప్ప కాంప్లిమెంట్స్. అయితే ఈ విజయాలు కేవలం అదృష్టంతో రాలేదు. తన ప్రతిభతో దక్కించుకొంది. కష్టంతో సాధించింది. ఎలాంటి కథల్ని ఎంచుకోవాలి? ఎలాంటి కాంబినేషన్స్ లో పని చేయాలి? అనే విషయంలో రష్మిక కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. పారితోషికాలకు బెండ్ అయిపోవడం, కాంబినేషన్ల మోజులో పడిపోవడం.. రష్మిక చేయడం లేదు. అదే రష్మిక విజయాలకు కారణం.
‘ఫలానా నిర్మాతని ఇబ్బంది పెట్టింది’ అనే కంప్లైంట్ రష్మిక కెరీర్లో రానేలేదు. ఇలాంటి క్రమశిక్షణ అగ్ర కథానాయికల్లో చూడడం చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. కథ నచ్చితే దర్శకుడు చెప్పింది చేసుకొంటూ వెళ్లిపోతుంది. అందుకు ‘కుబేర’ తాజా నిదర్శనం. ఓ సన్నివేశంలో చెత్త నిండిన మున్సిపాలిటీ వ్యాన్ లో ప్రయాణం చేయాల్సివచ్చింది. నెత్తి మీద నుంచి చెత్త గుమ్మరించుకోవాల్సివచ్చింది. దర్శకుడి ఆజ్ఞని శిరసా వహించింది. ఆఖరికి రష్మికపై తెరకెక్కించిన ఓ పాటని కత్తిరించినా ‘ఇదేంటి’ అని అలగలేదు. కనీసం ఆ ప్రస్తావన కూడా తేలేదు. అందుకే రష్మికతో పని చేయడానికి దర్శకులంతా ఇష్టపడుతుంటారు.
మొత్తానికి ‘కుబేర’తో రష్మిక మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. టాప్ కథానాయికల రేసులో.. ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చుంది. రష్మిక చేయబోయే సినిమాలు, ఆమె నుంచి రాబోతున్న సినిమాలకు ఈ విజయం మరో బూస్టప్.