‘వాల్తేరు వీరయ్య’ కాంబో మళ్లీ పట్టాలెక్కబోతోంది. చిరంజీవి – బాబీ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. ఈనెలలోనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టాల్సింది. కానీ కొన్ని సమీకరణాలు కుదరక ఆలస్యమైంది. మార్చి నుంచి క్లాప్కొట్టేస్తారని, 2027 సంక్రాంతి బరిలో దింపడమే ధ్యేయంగా పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి కాస్ట్ & క్రూ కి సంబంధించిన వివరాలు ఒకొక్కటీగా బయటకు వస్తున్నాయి.
ఇది సింగిల్ హీరో కథ కాదని, మల్టీస్టారర్ అని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే బాబీ – మోహన్ లాల్ మధ్య చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ రాక దాదాపు ఖాయమే.
కథానాయికగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ పేరు పరిశీలిస్తున్నారు. నయనతార, తమన్నా లాంటి పేర్లు పరిశీలనకు వచ్చినా, రవీనా అయితే.. జంట కొత్తగా ఉంటుందని టీమ్ భావిస్తోంది. కృతిశెట్టి ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకొన్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సెటప్ అయితే సిద్ధంగా ఉంది. క్లాప్ కొట్టేసి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేయడమే తరువాయి.
