తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక సారథిగా ఉన్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు రాజకీయ శక్తిగా అవతరించేందుకు సిద్ధమయ్యారు. శ్రీరామనవమి పర్వదినాన ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశం అధికారం సాధించడం కంటే, తనను దూరం పెట్టిన బీఆర్ఎస్ పార్టీ పునాదులను కదిలించడమే . ముఖ్యంగా తనపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రతీకారంగా, బీఆర్ఎస్ స్థానంలో తన పార్టీని అసలైన ప్రాంతీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఇరకాటంలో కేసీఆర్.. సర్దుకుపోని కేటీఆర్
కవిత తీసుకున్న ఈ నిర్ణయం కల్వకుంట్ల కుటుంబంలోనే కాకుండా పార్టీలోనూ పెద్ద చీలిక తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు తండ్రిగా కేసీఆర్ ఏమీ చెప్పలేక మౌనం వహిస్తుంటే, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మాత్రం కవితతో రాజీ పడే ప్రసక్తే లేదని సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావుల ఆధిపత్యం పెరిగిందని, వారు కేసీఆర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత బాహాటంగానే ఆరోపిస్తున్నారు. హరీష్, సంతోష్‌లను వదులుకుని కవితను మళ్ళీ దగ్గరకు తీసుకోలేని స్థితిలో కేసీఆర్ ఉండటంతో, పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఆ పార్టీలో అవకాశాలు దొరకని వారు కవిత పార్టీలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలపైనే కవిత గురి
కవిత వ్యూహం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. బీఆర్ఎస్ బలమైన కోటగా భావించే సిద్దిపేట నుండి ఆమె పోటీ చేసే అవకాశాలు కనిస్తున్నాయి. . ముఖ్యంగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ఆయన క్యాడర్‌ను తన వైపు తిప్పుకోవాలని ఆమె చూస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, కేసీఆర్ పాలనలో జరిగిన పొరపాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం కవిత ప్రధాన ఎజెండా. ఇది నిశ్చయంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడమే కాకుండా, ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారనుంది.
కవిత పోరాటానికి పరీక్ష
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి క్లీన్ చిట్ పొందిన తర్వాత, కవితలో రాజకీయ తెగింపు పెరిగింది. తాను ఒక బాధితురాలినని, సొంత పార్టీ నేతలే తనను ఇరికించారని ఆమె భావిస్తున్నారు. అందుకే, వ్యక్తిగా వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అన్న ఆమె నినాదం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ ఇమేజ్ లేకుండా, కేవలం జాగృతి సెంటిమెంట్‌తో ఆమె ఎంతవరకు నెట్టుకొస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. శ్రీరామనవమి రోజున ఆమె చేసే ప్రకటనతో తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలవ్వడం ఖాయం.

