అమరావతిలో నిర్మాణంలో ప్రభుత్వ నివాసాలన్నీ మార్చికల్లా పూర్తి చేసి జీఏడీకి అప్పగిస్తామని.. ఏప్రిల్ నుంచి అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆ నివాసాల్లో ఉండవచ్చని మంత్రి నారాయణ ప్రకటించారు. చివరి దశకు వచ్చిన ఇళ్ల నిర్మాణాలను నారాయణ పరిశీలించారు. మంత్రులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కోసం నిర్మిస్తున్న అధికారిక నివాసాలకు ఫినిషింగ్ వర్క్ జరుగుతోంది.
అమరావతిలో ప్రస్తుతం మొత్తం 4,026 నివాసాలు నిర్మిస్తున్నారు. అందులో 186 బంగళాలు, మిగిలినవి అపార్ట్మెంట్ తరహాలో ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా వచ్చినప్పటికీ పనుల వేగం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు, జడ్జిల బంగళాల పనులు తుది దశకు చేరుకున్నాయని, మార్చి చివరి నాటికి దాదాపు 3,500 నివాస సముదాయాలు పూర్తి చేసి జీఏడీ కి అప్పగిస్తామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూడా వేగంగా జరుగతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులపై కూడా మంత్రి స్పష్టతనిచ్చారు. ఈ రహదారికి సంబంధించి ఇంకా అవసరమైన నాలుగున్నర ఎకరాల భూసేకరణ కోసం వచ్చే బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాదిలో అమరావతికి ఓ రూపం వస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తవుతాయి. నీటి అవసరాలకు రిజర్వాయర్లు కూడా పూర్తవుతాయి. ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడం.. కాంట్రాక్టర్లు అందరూ మంచి అనుభవం ఉన్న వారు కావడంతో .. అత్యాధునిక యంత్రాలు, టెక్నాలజీతో వేగంగా పనులు చేయిస్తున్నారు.
