వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుసరిస్తున్న తీరు ఇప్పుడు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై ఆయన చేసిన ఫిర్యాదుల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని, వాటిని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కొట్టివేయాలని సీఐడీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో, తన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే ఫిబ్రవరి 27న ఏసీబీ కోర్టుకు హాజరై సమర్పించాలని ఆళ్లకు నోటీసులు కూడా అందాయి. అయితే, కింది కోర్టులో సాక్ష్యాలు చూపే ధైర్యం లేక, హైకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. కాలయాపన చేసేందుకు ఆళ్ల ఈ కుట్ర చేశారని సులువుగానే అర్థమవుతోంది.
చంద్రబాబుకు గతంలో మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆళ్ల దాఖలు చేసిన పిటిషన్ వెనుక లోతైన వ్యూహం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింది కోర్టులో కేసు ముగిసిపోకుండా అడ్డుకోవడమే ఆయన ప్రధాన ఉద్దేశం. హైకోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉందనే సాకుతో, ఏసీబీ కోర్టులో విచారణను ఆపాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తప్పుడు కేసులకు సాక్ష్యాలు చూపలేక, ఇలాంటి న్యాయపరమైన చిక్కుముడులతో వ్యవస్థను తప్పుదోవ పట్టించాలని చూడటం సరికాదని టీడీపీ వర్గాలంటున్నాయి.
హైకోర్టులో జరిగిన విచారణలో సీఐడీ తరపు న్యాయవాదులు ఆళ్ల పిటిషన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బెయిల్ రద్దు పిటిషన్ కు విచారణార్హత లేదని వారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, ఫిర్యాదుదారు నేరుగా హైకోర్టుకు రాకుండా ఏసీబీ కోర్టులోనే తన అభ్యంతరాలు తెలపాలని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ముందుగా ఈ పిటిషన్ విచారణకు అర్హమా కాదా అనే అంశంపైనే తాము నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.
ఈ లోగా ఫిబ్రవరి 27న విజయవాడ ఏసీబీ కోర్టులో ఆళ్ల హాజరు కావాల్సి ఉంది. తన వద్ద సాక్ష్యాలు లేవని తేలిపోతే ఎదురయ్యే పరిణామాల నుంచి తప్పించుకోవడానికే ఆయన హైకోర్టును ఆశ్రయించారని, కానీ ఇప్పుడు అటు కింది కోర్టులోనూ, ఇటు హైకోర్టులోనూ ఆయనకు చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబుపై బనాయించిన కేసుల్లో పస లేదని తేలుతున్న కొద్దీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. న్యాయస్థానాలను కన్ఫ్యూజ్ చేయాలనుకున్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేక ఎదురుదెబ్బ తగులుతుందా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
