జగన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన వైనం చూసి అప్పట్లో ఇక ఎన్నికల్లో పాల్గొనడం కూడా దండగే అనుకున్నాయి ఇతర పార్టీలు. ఇప్పుడు అధికారం మారడంతో జగన్ రెడ్డి కంటే ఎక్కువ వచ్చు అని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఉన్న మెజార్టీ మున్సిపాల్టీల్లో కూటమి జెండా ఎగరేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే గడువును రెండున్నరేళ్లకు పరిమితం చేస్తూ తాజా అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసేందుకు నిర్ణయించారు.
2021లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2026లో జరగాల్సి ఉంది. తమ ప్రభుత్వం పోయినా సరే స్థానిక సంస్థలు తమ గుప్పిట్లోనే ఉండేలా జగన్ ప్రభుత్వం గతంలో అవిశ్వాసాలు పెట్టకుండా చట్టం చేసింది. నాలుగేళ్ల తర్వాతనే అవిశ్వాసం పెట్టేందుకు అనుమతి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రకారం వచ్చే ఏడాది చివరి వరకూ అవిశ్వాసాలు పెట్టేందుకు అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు చట్టం మార్చేసి అయినా పురపాలకల్లో పీఠాలను మార్చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి పార్టీల్లోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. పీఠాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో మరింత విస్తృతంగా కౌన్సిలర్లు .. కార్పొరేటర్లు చేరనున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన వారికి ఆయా మున్సిపాలిటీల్లో పీఠాలు అప్పగించేందుకు వారు సిద్ధమవుతున్నారు. తమకు నిధులు కేటాయించక ఎలాంటి పనులు చేయలేకపోయామని వారు మథనపడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టం ప్రకారం వారికి రావాల్సినవి వారికి అప్పగిస్తున్నారు.. అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి సమస్య ఉండదని అంచనా వేస్తున్నారు.
ముందుగానే వైసీపీ స్థానిక నాయకత్వం చేతులు ఎత్తేస్తోంది. ఇక స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలో జగన్ చూపించారు కాబట్టి అంతకు మించి చేస్తారు.. వైసీపీకి ఒక్క కౌన్సిలర్ పోస్టు దక్కడం కూడా కష్టమవుతుంది.