మహావతార్ నరసింహ యానిమేటెడ్ సినిమా అనూహ్య విజయం సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న విడుదలైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా విజయాన్ని అందుకుంది. సినిమాకు చాలా మంచి ఫుట్‌ఫాల్స్ ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మేకర్స్ థాంక్స్ చెబుతూ సక్సెస్ మీట్ పెట్టారు.
ఈ సక్సెస్ మీట్లో అల్లు అరవింద్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఓ విన్నపం చేశారు. ‘‘మా కుటుంబంలో, సన్నిహితులు, పరిచయం ఉన్నవారందరిలో సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతాం. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలని’’ కోరారు అరవింద్. పవన్ ఈ సినిమా గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మరి అల్లు విన్నపంపై పవన్ ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.